India squad T20 World Cup 2022: అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించింది.. బీసీసీఐ. మొత్తం 15 మందితో కూడిన పటిష్ట జట్టును అందుకు ఎంపిక చేసింది. ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ తిరిగిరాగా, అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచెయ్యి చూపింది.. బీసీసీఐ. టీ20ల్లో వరుసగా విఫలమవుతున్న రిషభ్ పంత్ వైపే సెలెక్టర్లు మొగ్గుచూపారు. ఈ క్రమంలో శాంసన్ క్రికెట్ కెరీర్ ముగిసినట్టే! అంటూ వార్తలొస్తున్నాయి.
అప్పుడెప్పుడో 7 ఏళ్ల క్రితం టీ20ల్లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సంజూ శాంసన్, ఇప్పటిదాకా ఆడింది 16 మ్యాచులే. 2015 జులైలో జింబాబ్వేతో జరిగిన మ్యాచులో అంతర్జాతీయ టీ20ల్లో అరంగ్రేటం చేసిన శాంసన్ కు ఏదో అడపాదడపా అవకాశాలొచ్చినా తుది జట్టులో చోటుదక్కిన సందర్భాలు చాలా తక్కువ. గతేడాది అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సూర్యకుమార్ యాదవ్, ఇప్పటికే 25 టీ20లు ఆడాడంటే అర్థం చేసుకోవచ్చు. శాంసన్ కు ఎన్ని అవకాశాలిస్తున్నారా? అన్నది. ఆసియా కప్ టోర్నీలో రిషభ్ పంత్ విఫలమవడంతో టీ20 ప్రపంచ కప్ జట్టులో శాంసన్ కు చోటుదక్కడం ఖాయమనుకున్నారు అందరూ. అయితే.. కనీసం స్టాండ్ బై ప్లేయర్ గా కూడా ఎంపిక చేయలేదు.. సెలెక్టర్లు. ఈ క్రమంలో శాంసన్ టీ20 క్రికెట్ కెరీర్ ముగిసినట్టే అంటూ వార్తలొస్తున్నాయి. ఒకవేళ అవకాశమిచ్చినా.. జింబాబ్వే, ఐర్లాండ్ టూర్లకు ఎంపిక చేస్తారే తప్ప, ఐసీసీ టోర్నీల్లో చోటుదక్కడం అసంభవమంటున్నారు.. అభిమానులు.
వన్డేలు, టెస్టుల్లో అదరగొడుతున్న పంత్ టీ20ల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. కనీసం 30 పరుగులు చేసి ఎన్ని ఇన్నింగ్స్ లు అయ్యిందో. 14, 17.. ఆసియా కప్ టోర్నీలో పంత్ చేసిన స్కోర్లు. ఈ తరుణంలో టీ20ల నుంచి పంత్ ను తప్పించి శాంసన్ కు అవకాశాలివ్వాలంటూ మాజీలు సూచించారు. ఈ విమర్శలను బీసీసీఐ ఏమాత్రం పట్టించుకోలేదు. పంత్ వైపే.. మొగ్గుచూపింది. టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసిన జట్టులో దాదాపు ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడిన ఆటగాళ్ళకు చోటు దక్కడం గమనార్హం. 6 జట్లు పాల్గొన్న ఆసియా కప్ టోర్నమెంట్ లో ఫైనల్ కు కూడా అర్హత సాధించని భారత జట్టు.. ఆస్ట్రేలియా వేదికగా ఏమాత్రం రాణిస్తుందన్నదే ప్రశ్న. టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసిన భారత జట్టుపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (కీపర్), దినేష్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.
స్టాండ్ బై ప్లేయర్స్: మహమ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్.