భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్.. అదీ మన హైదరాబాద్ లో.. మరి ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు ఊరుకుంటారా? తమ అభిమాన ఆటగాళ్లను దగ్గరుండి చూడాలని ఊవ్విళ్లూరుతుంటారు. మ్యాచ్ చూడడానికి టికెట్ల కోసం ఒక్కసారిగా జింఖానా గ్రౌండ్ వద్ద ఎగబడ్డారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఈ తొక్కిసలాటలో రజిత అనే మహిళ తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పొయింది. దాంతో అక్కడే విధులలో ఉన్న మహిళా కానిస్టేబుల్, తోటి కానిస్టేబుల్స్ ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారడంతో ఆ మహిళా కానిస్టేబుల్ పై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీస్.. అంటేనే జనాలకు ఒక రకమైన భావన ఉంటుంది. లంచాలు తీసుకుంటారు.. స్టేషన్ కు పోతే కొడతారు.. బూతులు తిడతారు.. ఇలా అనేక రకాల మాటల నడుమ వారు డ్యూటీ చేస్తూంటారు. తాజాగా జింఖానా గ్రౌండ్ వద్ద జరిగిన సంఘటన చూస్తే మీరు ఆ మహిళా పోలీసుకు హేట్యాఫ్ చెప్పాల్సిందే. క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం వేలాది మంది జింఖానా మైదానానికి వచ్చారు. ఈ క్రమంలోనే గేట్లు తెరవడంతోనే ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో అక్కడికి పోలీసులు వచ్చారు. పోలీసులు రావడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అక్కడి వారిని చెదరగొడదానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దాంతో తొక్కిసలాట జరిగి చాలా మందికి కాళ్లు, చేతులు కూడా విరిగినట్లు తెలుస్తోంది. రజిత అనే మహిళ తొక్కిసలాటలో స్పృహ కోల్పొయింది. దాంతో పక్కనే ఉన్న నవీన అనే లేడి కానిస్టేబులు ఆమెను గమనించింది. వెంటనే ఆమెకు ప్రథమ చికిత్సను అందించింది. తన నోటి ద్వారానే ఆమెకు శ్వాసను అందించింది. సీపీఆర్ కూడా చేసింది. మిగతా కానిస్టేబల్స్ సైతం రజిత కాళ్లు, చేతులు నలుస్తూ.. ఆమెకు సాయం చేశారు.
అనంతరం ఆమెను వెంటనే హుటాహుటిన యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె మరణించినట్లుగా కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వార్తలపై అడిషనల్ కమిషనర్ చౌహాన్ స్పందించారు. రజిత అనే మహిళ చనిపోలేదని, ఆమె యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది అని ఆయన స్పష్టం చేశారు. ఇక మహిళ ప్రాణాలను కాపాడిన కానిస్టేబులు నవీనను ప్రత్యేకంగా అభినందించారు. నవీన బేగంపేట పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తోంది. నవీన ప్రథమ చికిత్స చేస్తున్న పిక్స్ వైరల్ గా మారాయి. సాటి మహిళ ప్రాణాలు కాపాడినందుకు నెటిజన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ తొక్కిసలాటలో 20 మంది గాయపడ్డట్లు సమాచారం. మరి సాటి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ నవీనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.