రీసెంట్ గా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఫైనల్ వరకు వచ్చేసింది. కానీ అక్కడ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. అసలు పాక్ జట్టు ఆట చూసిన ఎవరైనా సరే కనీసం గ్రూప్ దశ అయినా దాటుతుందా అని డౌట్ పడ్డారు. ఎందుకంటే స్టార్టింగ్ లోనే రెండు మ్యాచులు ఓడిపోయింది కాబట్టి. అలాంటి ఈ జట్టు.. ఫైనల్ చేరేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఓడిపోవడంతో పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతెందుకు సొంత దేశానికి చెందిన మాజీ కెప్టెనే.. పాక్ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడు. వాళ్లు కావాలనే ఓడిపోయారని అభిప్రాయపడ్డాడు. ఇంతకీ ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పెద్దగా అంచనాల్లేకుండానే బరిలోకి దిగింది. రన్నరప్ గా నిలిచింది. అంతకు ముందు జరిగిన ఆసియాకప్ లోనూ పాక్ జట్టు ఫైనల్ చేరింది. అయితే పాక్ ప్రస్తుత ఆటతీరుపై మాత్రం ఆ దేశ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ తీవ్ర విమర్శలు చేశాడు. ‘పాక్ జట్టులోని కొందరు ప్లేయర్లు కౌంటీ మ్యాచులు ఆడారు. మరి టీ20 వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్లు భవిష్యత్తు మాటేంటి? వాళ్లని నా స్టూడియోకి తీసుకురండి. వాళ్లకు క్రికెట్ గురించి ఎంత తెలుసో మాట్లాడాలి. పాక్ క్రికెట్ బోర్డు ఫారెన్ కోచ్ లని ఎందుకు పెట్టుకుంటోంది?’
‘విదేశీ కోచ్ లు అయితే ఏదైనా తప్పు జరిగితే వాళ్లపై తోసేయొచ్చు. టోర్నీలో ఓడిపోతే వాళ్లని నిందిస్తారు. గెలిస్తే మాత్రం క్రెడిట్ కొట్టేస్తారు. పాక్ బోర్డులో ఉన్నవాళ్లు ఎవరూ క్రికెట్ ఆడలేదా? నా గురించి చెప్పడం లేదు కానీ చాలా ఆఫర్స్ వచ్చాయి. కోచ్ గా చేయడం ఇష్టం లేక బయటకు వెళ్లలేదు. మరి ఇప్పుడు ఆడుతున్న ఆటగాళ్ల సంగతేంటి? వాళ్లు విదేశాలకు ఎక్కడికి వెళ్లినా ఆడలేరు. అందుకే ఫిక్సింగ్ చేస్తున్నారు. ఎందుకంటే జట్టులో ప్రతి ఒక్కరికీ వారి కెరీర్ ముఖ్యం. ఫిక్సింగ్ చేయకపోతే కెరీర్ ఉండదని భయపడుతున్నారు. నిజనిజాలు భయపెట్టండి’ అని పాక్ కెప్టెన్ మియాందాద్ సీరియస్ అయ్యాడు. ఇదిలా ఉండగా టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పుణ్యమా అని పాక్ జట్టు సెమీస్ చేరింది. ఫైనల్లో కూడా అడుగుపెట్టేసింది. అయితే ఫిక్సింగ్ చేయడం వల్లే పాక్ ఇక్కడ వరకూ రాగలిగిందని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.