భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీలు ఒక మ్యాచ్‌లో టీమిండియాను బుకీల బారి నుంచి కాపాడారు. ఇదో రియల్ స్టోరీ. దీని గురించి పూర్తి వివరాలు..!
సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ.. వరల్డ్ క్రికెట్‌కు భారత్ అందించిన ఇద్దరు గొప్ప ప్లేయర్లు అనే చెప్పాలి. ఆటగాడిగా సచిన్ అత్యున్నత శిఖరాలు అధిరోహించాడు. క్రికెట్లో అతడు చూడని విజయం లేదు. మాస్టర్ బ్లాస్టర్‌కు దాసోహం అనని రికార్డు లేదు. టన్నుల కొద్దీ రన్స్ చేసి గ్రేటెస్ట్ బ్యాటర్‌గా అవతరించాడు. సెహ్వాగ్ దగ్గర నుంచి కోహ్లీ దాకా ఎందరో క్రికెటర్లు సచిన్‌ను స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్‌ను మొదలుపెట్టారు. ఇక, గంగూలీ గురించి తెలిసిందే. లెఫ్టాండర్ బ్యాటర్‌గా కళాత్మక షాట్లతో పాటు విధ్వంసకర బ్యాటింగ్‌తో అపోజిషన్ టీమ్ వెన్నులో వణుకు పుట్టించేవాడు. అతడు కొట్టే సిక్సర్లు స్టేడియాలు దాటి ఎక్కడో పడేవి. బ్యాటర్‌గానే గాక కెప్టెన్‌గానూ భారత జట్టును ముందుండి నడిపాడు దాదా. అలా సచిన్, గంగూలీలు భారత క్రికెట్‌కు విశిష్ట సేవలు అందించారు.
అలాంటి సచిన్-గంగూలీలు ఒక మ్యాచ్‌లో టీమిండియాను బుకీల బారి నుంచి కాపాడారు. 1990వ దశకం చివర్లో మ్యాచ్ ఫిక్సింగ్ క్రికెట్‌ను కుదిపేసింది. ఆ సమయంలోనే శ్రీలంకలో నిదాహస్ కప్ జరిగింది. ఈ ట్రై సిరీస్‌లో లంకతో పాటు భారత్, న్యూజిలాండ్‌లు పోటీపడ్డాయి. ఫైనల్స్‌కు టీమిండియా, శ్రీలంక క్వాలిఫై అయ్యాయి. అయితే ఫైనల్ మ్యాచ్ రేపు జరుగుతుందనగా సచిన్ టెండూల్కర్ ఓ విషయాన్ని గమనించాడు. ఆ మ్యాచ్‌ను ఫిక్స్ చేయడానికి భారత జట్టులోని ఒక సీనియర్ ప్లేయర్ ప్రయత్నిస్తున్నట్లు సచిన్‌కు అర్థమైంది. ఆ సీనియర్ ప్లేయర్ బుకీలతో ఫోన్ కాల్ మాట్లాడుతుండటాన్ని మాస్టర్ బ్లాస్టర్ గుర్తించాడు. మ్యాచ్ ఫిక్స్ కాబోతోందని అప్పటి భారత జట్టు మేనేజర్ అన్షుమన్ గైక్వాడ్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో తన ఓపెనింగ్ పార్ట్నర్ అయిన గంగూలీని పిలిచాడు సచిన్. మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నాలు జరుగుతున్న అంశాన్ని గంగూలీతో చర్చించాడు. ఎలాగైనా ఆ సీనియర్ ప్లేయర్ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని వీళ్లిద్దరూ డిసైడ్ అయ్యారు.
ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేసేది తామే కాబట్టి మ్యాచ్‌ను గెలిపించాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు భారీ స్కోరును అందించారు సచిన్-గంగూలీలు. తొలి వికెట్‌కు ఏకంగా 252 రన్స్ జోడించారు. సచిన్ (128), గంగూలీ (109)లు సెంచరీలతో చెలరేగారు. దీంతో భారత్ 50 ఓవర్లలో 307 రన్స్ చేసింది. ఛేజింగ్‌కు దిగిన లంక ఇన్నింగ్స్‌లో అరవింద్ డిసిల్వా సెంచరీ చేసినా.. ఆ జట్టు 6 రన్స్ తేడాతో ఓడిపోయింది. ముత్తయ్య మురళీధరన్, ధర్మసేన, జయసూర్య లాంటి వారి బౌలింగ్‌లో సచిన్-దాదా విజృంభించి ఆడారు. జట్టును ఎలాగైనా గెలిపించాలని అనుకొని మరీ భారత్‌కు విజయాన్ని, ట్రోఫీని అందించారు. తమ బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫిక్సింగ్‌ను అడ్డుకొని భారత జట్టును ఆదుకున్నారు. ఇదో రియల్ స్టోరీ. ఈ విషయాన్ని అప్పటి జట్టు మేనేజర్ అన్షుమన్ గైక్వాడ్ పలు టీవీ ఇంటర్వ్యూల్లోనూ చెప్పాడు. తనకు వచ్చిన కాల్స్ గురించి.. సచిన్-గంగూలీలు కలసి భారత జట్టును ఆ మ్యాచ్‌లో ఎలా బయటపడేశారో తెలిపాడు.