క్రికెట్ లో అంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో అంపైర్ నిర్ణయం పై ప్లేయర్స్ అసహనం వ్యక్తం చేస్తుంటారు. అరుదుగా అంపైర్ పై భౌతిక దాడి చేస్తారు. ఇలాంటివి అన్ని ఆటల్లో చూస్తుంటాం. కానీ ఇలాంటి వివాదాలకు భారత్ క్రికెటర్లు చాలా దూరంగా ఉంటారు. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కొంచెం రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రాహుల్ చాహర్ అంపైర్ తో ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దక్షిణాఫ్రికాలోని బ్లూమ్ఫోంటైన్ లో టీమిండియా-ఏ జట్టు తో దక్షిణాఫ్రికా-ఏ జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. రెండో రోజు ఆటలో భారత బౌలర్ రాహుల్ చాహర్ అంపైర్ తో వాగ్వాదానికి దిగి, దురుసుగా ప్రవర్తించాడు. ఇన్నింగ్స్ లో 128వ ఓవర్ వేసేందుకు రాహుల్ చాహర్ బంతిని తీసుకున్నాడు. అతని బౌలింగ్లో బంతి.. బ్యాట్స్ మన్ ప్యాడ్ లను తాకింది. అయితే వెంటనే ఎల్బీకు రాహుల్ అప్పీల్ చేశాడు.. అప్పీల్ ను అంపైర్ తిరస్కరించాడు. దీంతో వెంటనే కోపంతో ఊగిపోయిన చాహర్ తన కళ్ల జోడును నేలకేసి కొట్టాడు. అంతేకాకుండా అంపైర్ తో కొద్దిసేపు వాగ్వాదానికి కూడా దిగాడు. అనంతరం మిగిలిన బాల్ వేసి ఓవర్ పూర్తి చేశాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ దక్షిణాఫ్రికా-ఏ జట్టు 509 పరుగులు చేసి భారత్ పై పైచేయి సాధించింది. అయితే భారత్ కూడా ఈ మ్యాచ్ లో గట్టిగానే పోరాడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 308 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ కొట్టాడు. ప్రియాంక్ పాంచల్ 96 పరుగులు చేసి కొద్దిలో సెంచరి అవకాశం చేజార్చుకున్నాడు.