అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీసీ ఎప్పటికప్పుడు అవసరమైన కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆ నిబంధనలు బ్యాటర్లకు, బౌలింగ్ టీమ్‌కో ఎంతో కొంత నష్టం కలిగించేలా ఉంటున్నాయి. తాజాగా ఐసీసీ తెచ్చిన కొత్త నిబంధన ఒకటి బౌలర్ల పాలిట శాపంగా మారనుంది. స్లో ఓవర్ రేట్‌పై ఇన్ని రోజులు కెప్టెన్ మ్యాచ్ ఫీజులో కోత పెట్టేది. కానీ కొత్తగా స్లో ఓవర్ రేట్‌పై జరిమానా విధింపు నిబంధనను ఐసీసీ అమలు చేసింది. అలాగే, మ్యాచ్ సమయంలో డ్రింక్స్ విరామం తీసుకోవాలని నిబంధన విధించారు. ఈ నిబంధనలు జనవరి 2022 నుంచి అమలులోకి వస్తాయి.
కొత్త నిబంధనల ప్రకారం, ఓవర్ రేట్‌లో జట్టు నిర్ణీత సమయం కంటే వెనుకబడి ఉంటే, మిగిలిన ఓవర్లలో, ఫీల్డర్ 30 గజాల సర్కిల్ వెలుపల నిలబడలేరు. అతను 30 గజాల సర్కిల్‌లో నిలబడాల్సి ఉంటుంది. ప్రస్తుతం, పవర్‌ప్లే తర్వాత ఐదుగురు ఫీల్డర్లు 30 గజాల సర్కిల్ వెలుపల ఉండనున్నారు. కానీ, కొత్త నిబంధనల ప్రకారం, జట్టు తప్పు చేస్తే, నలుగురు ఫీల్డర్లు మాత్రమే బయట ఉండనున్నారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న ది హండ్రెడ్ టోర్నీలో ఇలాంటి నిబంధనను చూసి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్లలో ఆట వేగాన్ని మెరుగుపరచడానికి ఇలాంటి నిబంధనలు తీసుకొస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది.