ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా సెలెక్షన్ గురించి మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యమైన ఒక ప్లేయర్‌ను జట్టులోకి తీసుకోకుండా భారత సెలెక్టర్లు తప్పు చేశారని అతడు అభిప్రాయపడ్డాడు.
దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులకు మస్తు వినోదం పంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 ముగిసింది. దీంతో అందరి చూపులు ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ వైపు షిఫ్ట్ అయ్యాయి. టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. జూన్ 7న ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఆడే ఆటగాళ్లకు సంబంధించిన జాబితాను ఇరు జట్లు ఇప్పటికే ఐసీసీకి సమర్పించాయి. అయితే టీమిండియా మాత్రం జట్టులో ఒక మార్పు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో యంగ్ లెఫ్టాండర్ యశస్వీ జైస్వాల్‌ను తీసుకుంటున్నట్లు ప్రకటించింది. పెళ్లి కారణంగా రుతురాజ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. అయితే భారత జట్టు సెలెక్షన్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, లెజెండరీ ప్లేయర్ రికీ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ టీమ్ సెలెక్షన్లో భారత జట్టు తప్పు చేసిందన్నాడు పాంటింగ్. ఒక కీలక ప్లేయర్‌ను టీమ్‌లోకి తీసుకోకపోవడం బిగ్ మిస్టేక్ అని చెప్పాడు. ‘హార్దిక్ పాండ్యా లాంటి విలువలైన ఆల్‌రౌండర్‌ను భారత టీమ్‌లోకి తీసుకోలేదు. ఫిట్నెస్ సమస్యల వల్ల టెస్టు మ్యాచ్ ఆడటం హార్దిక్ బాడీకి ఇబ్బంది కలిగిస్తుందని నాకూ తెలుసు. కానీ ఈ ఐపీఎల్లో అతడు మంచి పేస్‌తో బౌలింగ్ చేశాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో అతడు ఆడితే టీమిండియాకు మరింత బలం చేకూరేది. రెండు టీమ్స్‌కు మధ్య ఉన్న ప్రధాన తేడా అతడే అయ్యుండేవాడు’ అని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. రెగ్యులర్‌గా కాకున్నా ఇలాంటి కీలకమైన టెస్టు మ్యాచుల్లోనైనా పాండ్యాను ఆడిస్తే బాగుంటుందని పాంటింగ్ సూచించాడు. మరి.. ఆసీస్ మాజీ కెప్టెన్ చెప్పినట్లు డబ్ల్యూటీసీ ఫైనల్లో హార్దిక్‌ను ఆడించకుండా భారత్ తప్పు చేస్తోందా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.