2022 టీమిండియాకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. మెగా టోర్నీల్లో దారుణంగా విఫలం అయ్యి.. ఇంటా బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దాంతో జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు బీసీసీఐ నడుం బిగించింది. అందులో భాగంగానే పలు సంస్కరణలు తీసుకుంటోంది. ఇక 2023లో టీమిండియా తన తొలి మ్యాచ్ ను 2022 ఆసియా కప్ విజేత శ్రీలంకతో ఆడబోతోంది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా మంగళవారం తొలి టీ20 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే విలేకరులతో మాట్లాడాడు టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఈ సమావేశంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ స్టార్ ఆల్ రౌండర్.
టీమిండియా 2023లో తన తొలి మ్యాచ్ ను శ్రీలంకతో ఆడనుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ లో లంకతో తలపడేందుకు టీమిండియా సన్నద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ కు ముందు విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఈ సమావేశంలో పాండ్యా మాట్లాడుతూ..”ప్రస్తుతం టీమిండియా అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా ఉంది. ఇక స్వదేశంలో జరిగే 2023 వరల్డ్ కప్ ను టీమిండియా కచ్చితంగా గెలుచుకుంటుంది. ఇదే ఈ ఏడాది మా ముందు ఉన్న అతిపెద్ద రిజల్యూషన్. దానికోసం మేము అన్ని విధాల సిద్దం అవుతున్నాం. ప్రపంచ కప్ లో మేం మా శక్తికి మించి ఆడతామన్న నమ్మకం మాకుంది” అని పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు.
టీ20 ప్రపంచ కప్ లో ఓటమి గురించి కూడా ఈ సందర్భంగా స్పందించాడు. టీ20 ప్రపంచ కప్ లో మేం మా శక్తికి మించి పోరాడాం కానీ.. మా లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయాం. ఆ టోర్నీలో సెమీస్ లోనే ఇంటిదారి పట్టాల్సి వచ్చిందని పాండ్యా అన్నాడు. అయితే వాటన్నింటిని అధిగమించి వచ్చే వన్డే ప్రపంచ కప్ ను సాధిస్తామని చెప్పుకొచ్చాడు. దానికంటే ముందు ప్రస్తుతం టీమిండియా ముందు ఉన్న శ్రీలంక, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా లతో జరిగే సిరీస్ లపై దృష్టి సాధించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా పాండ్యా పేర్కొన్నాడు.
Eyes on the prize 👀#CricTracker #HardikPandya #WorldCup2023 pic.twitter.com/GinCWyQn5k
— CricTracker (@Cricketracker) January 2, 2023