టీ20 వరల్డ్ కప్ 2022లో ఘోర వైఫల్యం తర్వాత న్యూజిలాండ్‌పై 1-0 తేడాతో టీమిండియా టీ20 సిరీస్ గెలిచింది. మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఇక మూడో టీ20 వర్షం కారణంగా నిలిచిపోవడంతో డీఎస్‌ఎస్ పద్ధతి ప్రకారం టైగా ముగిసింది. దీంతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. అయితే.. వరల్డ్ కప్ తర్వాత.. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, అశ్విన్, షమీలకు విశ్రాంతి ఇచ్చి.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో యంగ్ టీమ్‌ను న్యూజిలాండ్‌తో టీ20కు పంపారు సెలెక్టర్లు. అప్పటికే వరల్డ్ కప్‌లో విఫలమైన ఆటగాళ్లను కూడా ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి.
అయినా కూడా వారిని పక్కన పెట్టి ఇతర యువ క్రికెటర్లకు తుది జట్టులో స్థానం కల్పిస్తారని అంతా భావించారు. కానీ.. హార్దిక్ పాండ్యా మాత్రం వరల్డ్ కప్‌లో దారుణంగా విఫలమైన రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్, దీపక్ హుడాలకే అవకాశాలు ఇచ్చి.. సంజు శాంసన్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్‌ను పూర్తిగా బెంచ్‌కే పరిమితం చేశాడు. దీంతో పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిసింది. ముఖ్యంగా సంజు శాంసన్‌ను ఆడించకపోవడంపై క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లపై అద్భుతంగా ఆడే సంజును, గంటకు 156 కిమీ వేగంతో బౌలింగ్ వేసే ఉమ్రాన్ మాలిక్‌ను బెంచ్‌కు పరిమితం చేయడంపై మాజీ క్రికెటర్లు సైతం ఆశ్యర్యం వ్యక్తం చేశారు.
ఈ విమర్శలపై సిరీస్ ముగిసిన అనంతరం టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీడియా సమావేశంలో స్పందించాడు. సంజు శాంసన్‌ను ఆడించకపోవడంపై మీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీరు ఏం చెబుతారు? అనే ప్రశ్నకు పాండ్యా బదులిస్తూ..‘బయట ఎవరో ఏదో చెబితే వాటిని మేము పట్టించుకోము. ఇది నా టీమ్. కోచ్‌తో చర్చించి.. అత్యుత్తమ జట్టును నేను ఎంపిక చేసుకుంటాను. అలాగే వారి బాధను సైతం నేను అర్థం చేసుకోగలను. ఆరోగ్యకరమైన చర్చకు వారి కోసం గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. వారొచ్చి నాతో మాట్లాడొచ్చు. ఇక సంజు శాంసన్‌ని అన్‌ఫార్చునేట్ కేస్. స్ట్రాటజీ కారణాలతోనే సంజును ఆడించలేకపోయాం.’ అని పాండ్యా వివరణ ఇచ్చుకున్నాడు.
కాగా.. అంత ప్రముఖ్యత లేని సిరీస్‌లో అప్పటికే వరల్డ్ కప్‌లో విఫలమైన ఆటగాళ్లను పట్టుకుని వేలాడే కంటే.. ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం సరైన పద్దతి అని క్రికెట్ అభిమానులు అంటున్నారు. అసలు ఏ మాత్రం ఉపయోగం లేని సిరీస్‌లో స్ట్రాటజీల పేరుతో ఓ ఆటగాడిని బెంచ్‌కే పరిమతం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. సిరీస్ డిసైడింగ్ మ్యాచ్‌లోనూ కివీస్ కెప్టెన్ ఆడకుండా.. యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చాడు. కెప్టెన్ అంటే అలా ఉండాలి. కానీ.. హార్దిక్ పాండ్యా తనను తాను ఎక్కువ ఊహించేసుకుంటున్నాడంటూ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం తన కెప్టెన్సీలో సిరీస్ గెలవాలనే స్వార్థంతోనే సంజు శాంసన్‌కు అవకాశం ఇవ్వకుండా.. దారుణంగా విఫలం అవుతున్న పంత్‌నే ఆడించాడని అంటున్నారు.