టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్, ప్రముఖ కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కామెంటరీ ప్యానెల్ నుంచి ఎవరు తప్పించారో రివీల్ చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఐపీఎల్‌లో ప్రముఖ కామెంటేటర్‌గా ఉన్న టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ హఠాత్తుగా అందులోంచి తప్పుకున్నారు. కానీ అసలు విషయం ఐపీఎల్ యాజమాన్యం అతడిని తప్పించింది. ఆ తరువాత ఇర్ఫాన్ పఠాన్ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నాడు. కామెంటేటర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్ పఠాన్‌ను ప్యానెల్ నుంచి తప్పించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీని వెనుక టీమ్ ఇండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఉన్నారంటూ గతంలో వార్తలొచ్చాయి. దాంతో చాలామంది క్రికెట్ అబిమానులు ఈ ఇద్దరిపై విమర్శలు గుప్పించారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ అసలు సంగతి బయటపెట్టారు. తనను ఐపీఎల్ 2025 కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పించడానికి కారణం అందరూ ఊహిస్తున్నట్టుగా రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ కానేకాదన్నారు. అనవసరంగా అందరూ ఈ ఇద్దరినీ తప్పుబట్టారని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ఓ టీమ్ ఇండియా ఆటగాడిని నిర్మొహమాటంగా విమర్శించినందుకే తనను ప్యానెల్ నుంచి తప్పించారంటూ సంచలనం రివీల్ చేశాడు. ఆ ఆటగాడు హార్దిక్ పాండ్యా అని స్పష్టం చేశాడు. తనను ప్యానెల్ నుంచి తప్పించడం వెనుక ఇతడి హస్తం ఉండవచ్చన్నాడు. ఎందుకంటే గతంలో తాను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ప్రదర్శనపై విమర్శలు చేశానన్నాడు. ఇది అతడి ఈగోను దెబ్బకొట్టిందన్నాడు.
కానీ వాస్తవానికి ఓ కామెంటేటర్‌గా ఆటగాళ్లను నిష్పక్షపాతంగా విశ్లేషించడం చేయాల్సి వస్తుందని తాను అదే చేశానన్నాడు. మొత్తం 14 మ్యాచ్‌లలో 7 మ్యాచ్‌లనే విమర్శిస్తున్నానంటే తాను ఎంత గౌరవంగా ఉన్నానో అర్ధం చేసుకోవచ్చన్నాడు. అంతకుమించి తనకు హార్దిక్ పాండ్యాకు గతంలో ఎప్పుడూ వైరం లేదన్నాడు. ఇక బరోడా నుంచి వచ్చిన ఆటగాళ్లు ఎవరు కూడా ఇర్ఫాన్ లేదా యూసుఫ్ తమకు సహాయం చేయలేదని చెప్పలేరన్నాడు. అదే సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ పదవి కోల్పోయినప్పుడు అందరూ హార్దిక్‌పై విమర్శలుచేస్తే తాను మద్దతుగా నిలిచిన సంగతిని గుర్తు చేశాడు.
కానీ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఆట తీరు సరిగ్గా లేదని విమర్శించినందుకు హార్దిక్ పాండ్యా ఈగో దెబ్బతిన్నదని అందుకే తనను ప్యానెల్ నుంచి తప్పించారని చెప్పుకొచ్చాడు. చాలామంది భావిస్తున్నట్టుగా విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మలను ఓ కామెంటేటర్‌గా తాను విమర్శించడం కారణం కాదన్నారు. హార్దిక్ పాండ్యాపై విమర్శలు చేయడం వల్లనే తనను తప్పించారంటూ సంచలనం రేపాడు. ఇర్ఫాన్ పఠాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదం రేపుతున్నాయి.