భారత్, ఇంగ్లండ్ మధ్య రీషెడ్యూల్ అయిన ఐదో టెస్టు మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. 2021 ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 6 మధ్య కాలంలో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాలుగు టెస్టులు జరిగాయి. అందులో భారత్ రెండు టెస్టులు గెలిచింది. ఇంగ్లండ్ ఒకటి గెలవగా, తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో 2-1తో టీమిండియా సిరీస్‌లో ముందంజలో ఉంది. కానీ.. ఆ సమయంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐదో టెస్టును పోస్టుపోన్ చేశారు. అదే టెస్టును ఏడాది తర్వాత ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచినా, డ్రా అయినా సిరీస్ మన సొంతం అవుతుంది. ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ డ్రా అవుతుంది.
ఇలా సిరీస్ డిసైడింగ్ టెస్టుగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఒక ప్రయోగం చేయనున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ కొంతపుంతలు తొక్కుతున్న తరుణంలో ప్రేక్షకుడికి మరింత మెరుగైన ప్రొడెక్ట్ అందించేందుకు ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్కై స్పోర్ట్స్ సరికొత్త ప్రయోగానికి పూనుకుంది. భారత్- ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్ట్‌ను దీనికి వేదిక చేసుకుంది. టీఆర్‌పీలు ఏ మాత్రం పడిపోకుండా.. మ్యాచ్ చూసేవాళ్లకు సరికొత్త అనుభూతినిచ్చేలా అదిరిపోయే ప్రణాళిక రచించింది.

ఈ మ్యాచ్‌ను టీవీ ప్రేక్షకులు మరింత దగ్గర్నుంచి చూసేందుకు గాను.. షాట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేసే ఇంగ్లండ్ ప్లేయర్ హెల్మెట్‌కు కెమెరాను అమర్చనుంది. దీని కోసం స్కై స్పోర్ట్స్.. ఐసీసీతో పాటు ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈసీబీ అనుమతి కూడా తీసుకుంది. ఇక ఇంగ్లండ్ తరఫున షాట్ లెగ్‌లో ఎక్కువగా ఫీల్డింగ్ చేసేది యువ ప్లేయర్ ఓలీ పోప్ అని గుర్తించిన స్కై స్పోర్ట్స్… అతను ఫీల్డింగ్ చేసే సమయంలో హెల్మెట్‌కు కెమెరాను అమర్చనుంది. తద్వారా టీవీల ముందు కూర్చుని మ్యాచును తిలకించే అభిమానులు.. బ్యాటర్లకు దగ్గరగా.. ఉండే ఆ అనుభూతిని పొందొచ్చు.
ఇందులో మరో విశేషమేమిటంటే ఈ కెమెరా.. స్టేడియంలోని ప్రేక్షకుల అరుపులను రికార్డు చేయదు. కేవలం తన ముందు ఉన్న బ్యాటర్ కదలికలు, అతడి ఆటను మాత్రమే దగ్గరగా రికార్డు చేస్తుంది. కాగా అంతర్జాతీయ టెస్టు మ్యాచుల్లో ఒక ఫీల్డర్ హెల్మెట్‌కు కెమెరాను అమర్చడం ఇదే తొలిసారి. మరి భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఎవరి హెల్మెట్‌కు కెమెరా అమరుస్తారో తెలియాల్సి ఉంది. మరి ఈ ప్రయోగంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
England’s Ollie Pope is all set to field with a camera on his helmet in the Test against India #ENGvIND https://t.co/iqqt44PqEu
— CricWick (@CricWick) June 30, 2022
