ఏపీ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఏపీలో పార్టీల మధ్య రాజకీయ వేడి రాజుకొంది. విశాఖ గర్జన, జనసేన జనవాణి కార్యక్రమాలతో మొదలైన పొలిటికల్ హీట్ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. విశాఖలో పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్నారని, వేధించారంటూ జనసేన, టీడీపీ, బీజేపీ వాదిస్తుండగా.. జనసేన కార్యకర్తలు మాపై దాడిచేశారు అంటూ వైసీపీ మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. విశాఖ ఘటన తర్వాతి నుంచి పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్లు పెట్టడం, సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉన్నారు. తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాను ప్యాకేజీ తీసుకున్నానని మాట్లాడేవారికి ఇకనుంచి మాములుగా ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ రాజకీయంపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారబోతోందని చెప్పుకొచ్చారు.
విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటనలో.. తర్వాత పలు రాజకీయ పరిణామాలు సంభవించాయి. పవన్ కల్యాణ్‌ని అడ్డుకున్నారని వార్తలు రావడంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన విషయం తెలిసిందే. చంద్రబాబు సైతం ఫోన్‌లో మాట్లాడటం, పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం కూడా చూశాం. బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా ఎందుకో పూర్తిస్థాయిలో ముందుకు వెళ్లలేకపోతున్నాం అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఆ విషయం ఏపీ బీజేపీ క్యాడర్‌కు కూడా తెలుసని చెప్పుకొచ్చారు. మరోవైపు భేటీ తర్వాత పవన్- చంద్రబాబు కలిసి పోరాడతామంటూ ప్రకటించారు. పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్, పవన్- చంద్రబాబు భేటీ అంశాలపై అధికారపార్టీ మంత్రులు, నేతలు సైతం స్పందించారు. పవన్- చంద్రబాబులు కలిసేందుకు విశాఖ ఘటనను వాడుకున్నారంటూ ఆరోపించారు.
ఈ అంశాలపై మాజీ మంత్రి పేర్ని నాని సైతం ఓ డిబేట్‌లో స్పందించారు. ఈ డిబేట్ సందర్భంగా.. మీరు పవన్ కల్యాణ్‌ని దుర్భాషలాడుతున్నారంటూ జనసేన నేత లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం చెప్పడమే కాకుండా పేర్ని నాని ఓ ఛాలెంజ్ కూడా విసిరారు. “నన్ను ఏరా నానీ అన్నప్పుడు నేను ఏరా పవన్ కల్యాణ్ అనకపోతే ఆయన ఫీల్ అవ్వడా? అరే నేను అన్ని మాటలు అన్నాను.. కానీ, నానీ నన్ను ఏమీ అనలేదు. సరుకులేని కాండెట్ కాబోలు అనుకోడా? నేను ఎప్పుడూ పవన్ కల్యాణ్‌ని ఏకవచనంతో సంబోధించలేదు. హీరో సాయిధరమ్ తేజ్ సినిమా ఈవెంట్‌లో నా గురించి మాట్లాడారు. ఆ తర్వాత రోజు సాయంత్రం 4 గంటలకు నేను స్పందించాను. మళ్లీ ఇవాళ మాట్లాడిన మాటలకు నేను రియాక్ట్ అయ్యాను అంతే. ఈ రెండుసార్లు తప్ప నేను ఎప్పుడూ పవన్ కల్యాణ్‌ని తప్పుగా మాట్లడాలేదు. ఒకవేళ అలా మాట్లాడినట్లు నిరూపిస్తే నేను పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాడానికి కూడా రెడీ” అంటూ పేర్ని నాని ఓపెన్ ఛాలెంజ్ చేశారు.