ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న బాహుబలి ది ఎపిక్ టీజర్ వచ్చేసింది. అక్టోబర్ 31న దేశంలోని అన్ని భాషల్లో ఈ దృశ్యకావ్యం విడుదల కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకించి బాహుబలి సినిమా ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాకు సంబంధించి ది ఎపిక్ టీజర్ వచ్చేసింది. నిర్మాత శోభు ఎర్లగడ్డ అతని బృందం ఇచ్చిన హామీ మేరకు టీజర్ విడుదల చేశారు. ది ఎపిక్ అనేది బాహుబలి 1, 2లను కలిపి కట్ చేసి రీ ఎడిట్ చేసిన సినిమా. అంటే రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా ఉంటుంది.
ప్రభాస్-అనుష్క శెట్టి నటించిన బాహుబలి టీజర్ కేవలం టెక్స్ట్ సూపర్‌తో రిలీజ్ అయింది. ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఉండే సింపుల్ టీజర్ ఇది. రెండు భాగాలు కలిపి ఉండటంతో సినిమా నిడివి ఎక్కువే ఉంటుంది. అయితే ఇటీవల యూఎస్ ప్రేక్షకులకు చూపించిన వెర్షన్‌కు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 31న అన్ని భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఐమ్యాక్స్, 4డీఎక్స్, డీ బాక్స్, ఎపిక్, డాల్బీ సినిమాల్లో ప్రేక్షకుడికి అద్భుతమైన అనుభవం అందించనుంది.