వెండి తెరపై కొన్ని ప్రత్యేకమైన జోడీలు ఎవర్ హిట్‌గా ఉంటాయి. ఆ జోడీ ఉంటే చాలు సినిమా హిట్ అంటారు ఫ్యాన్స్. ఒక్కోసారి ఆ జోడీ ఒక్కటవ్వాలని కూడా బలంగా కోరుకునే అభిమానులుంటారు. అలాంటి జోడీ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రభాస్ వర్సెస్ అనుష్క. ఈ ఇద్దరి జోడీపై ఇప్పుడు క్రేజీ అప్‌డేట్ వస్తోంది.
టాలీవుడ్ వెండి తెరపై ప్రభాస్ అనుష్క జోడీకు మంచి పేరుంది. ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు తక్కువే అయినా ఫ్యాన్స్ దృష్టిలో బెస్ట్ జోడీ ఇదే. బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలతో హిట్ పెయిర్ అని నిరూపించుకోవడమే కాకుండా ఇద్దరి మధ్య ఏదో ఉందనే అభిప్రాయం కలిగింది అందరికీ. ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని కూడా స్ప్రెడ్ చేశారు. ఇంకో విశేషం ఏంటంటే ఇద్దరికీ 40 దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. అదే సమయంలో తాము కేవలం స్నేహితులమేనంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు.
8 ఏళ్ల తరువాత తిరిగి కన్పించనున్న ప్రభాస్ అనుష్క జోడీ
వెండి తెరపై ప్రభాస్ అనుష్ కలిసి నటించి దాదాపుగా 8 ఏళ్లు పూర్తయ్యాయి. మళ్లీ ఇద్దరూ కలిసి నటించింది లేదు. కలిసి కన్పించింది లేదు. ఇద్దరూ కలిసి ఎప్పుడు నటిస్తారా అనే చర్చ నడుస్తూనే ఉంది. అయితే ఫ్యాన్స్ కోరిక త్వరలో నెరవేరనుంది. ఇద్దరూ కలిసి కన్పించబోతున్నారు. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీ అందిస్తోంది. అయితే ఈ ఇద్దరూ కలిసి కన్పించబోయేది సినిమాలో కాదు మరి. ఓ ఇంటర్వ్యూలో కలిసి కన్పించనున్నారు. అనుష్క నటించిన ఘాటీ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుండటంతో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సినిమా యూనిట్ ఇద్దరితో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది. ఘాటీ సినిమా గురించి అనుష్కను ప్రభాస్ ఇంటర్వ్యూ చేయనున్నాడు. మొత్తానికి ఇద్దరూ కలిసి ఒకే వేదికపై కన్పించనున్నారు.
అందుకే అనుష్క, ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. వెండి తెరపై కాకపోయినా కనీసం ఇలాగైనా కలుస్తారంటూ ఆనందపడుతున్నారు. బాహుబలి 10 ఏళ్ల వార్షికోత్సవానికి కూడా అనుష్క హాజరు కాలేదు. దాంతో ఇద్దరినీ కలిసి చూడాలనే ఫ్యాన్స్ కోరిక నెరవేరలేదు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరబోతోంది.