కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే వారికి ఈసీ కీలక మార్పు చేసింది. ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ’ పూర్తయిన కొత్త ఓటర్లు.. ఇక తల్లిదండ్రులు, తాతలు, నానమ్మల ఓటరు జాబితా వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు ఫారం-6లో మార్పులు చేసింది.ఇప్పటివరకు కొత్త ఓటరు పేరు ఓటర్ల జాబితాలో చేర్చేందుకు సాధారణ ఫారం-6 సరిపోయేది. అయితే ‘సర్’ ప్రక్రియ సమయంలో ఫారం-6తో పాటు అదనపు డిక్లరేషన్ తీసుకున్నారు. గతంలో ఉన్న ఓటర్ల జాబితాతో తమ కుటుంబానికి ఉన్న సంబంధాన్ని నిర్ధారించేందుకు తల్లిదండ్రులు లేదా తాతల వివరాలు ఇవ్వాలని అందులో కోరారు.
‘సర్’ పూర్తయిన రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ అదనపు డిక్లరేషన్ అవసరం ఉండదని స్పష్టం చేసింది. బిహార్, పశ్చిమ బెంగాల్ సహా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్ పూర్తయిందని ఈసీ తెలిపింది. సర్ సమయంలో పేరు జాబితాలో లేని వారు, అలాగే కొత్తగా ఓటు హక్కు పొందిన యువత, తొలిసారి ఓటు వేయబోయే వారు నిరంతర అప్‌డేషన్ ప్రక్రియలో పేర్లు నమోదు చేసుకోవచ్చు.అయితే ‘సర్’ ఇంకా కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం ఈ నిబంధన కొనసాగుతున్నట్లు వెల్లడించింది. కొత్త ఓటర్లు ఫారం-6తో పాటు ‘సర్’కు సంబంధించిన డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందని… గత ఓటర్ల జాబితాతో తమ సంబంధాన్ని చూపించే వివరాలను కూడా ఇవ్వాలని సూచించారు.
ఫారం-6లో మార్పులపై ఈసీలో విభేదాలు ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అదనపు డిక్లరేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఫారం-6, ‘సర్’కు సంబంధించిన నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ నిర్ణయాలేనని ఈసీ స్పష్టం చేసింది.సెప్టెంబర్ 26న విడుదల చేసిన వివరణలో సర్ డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని ఈసీ తెలిపింది. సర్ పూర్తయిన ప్రాంతాల్లో, అలాగే ఇంకా ప్రారంభం కాని ప్రాంతాల్లో అదనపు డిక్లరేషన్ అవసరం లేదని స్పష్టత నిచ్చింది. తాజా మార్పుతో సర్ పూర్తయిన రాష్ట్రాల్లో కొత్త ఓటర్లు ఇక సాధారణ ఫారం-6 ద్వారానే నమోదు చేసుకోవచ్చు. అదనంగా కుటుంబానికి సంబంధించిన పాత ఓటర్ల జాబితా వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఈసీ క్లారిటీ ఇచ్చింది
