తారకరత్న అజాత శత్రువు అనడానికి, తనకున్న కమిట్మెంట్ ఎంత గొప్పదో అని చెప్పడానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు. శత్రువులు లేనటువంటి వ్యక్తిగా తారకరత్న ఇవాళ అందనంత ఎత్తుకు ఎదిగడమే కాకుండా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడంలో కూడా వారెవ్వా అనిపించారు.
నందమూరి తారకరత్న మరణంతో ఆయన గురించి ఎప్పుడూ మాట్లాడనివారు కూడా ఆయన గురించి గొప్పగా చెబుతున్నారు. ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో చెబుతూనే కంటతడి పెట్టుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించేందుకు నేతలు వస్తున్నారు. వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు తారకరత్న మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. తారకరత్న అజాత శత్రువుగా నిలిచిపోయారని కొనియాడుతున్నారు. ఒక్క శత్రువు కూడా లేకుండా జీవించడం అంటే మామూలు విషయం కాదు. ఫ్యాన్స్ అందుకే ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని తారకరత్న గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.
అందరితో మంచిగా కలిసి మెలిసి ఉండేటటువంటి వ్యక్తి తారకరత్న అని అన్నారు. ఎవరినీ పేరు పెట్టి పిలవడని, అన్న అనో, తమ్ముడనో, బాబాయ్ అనో, పిన్ని అనో, అంకుల్ అనో పిలుస్తూ అందరినీ కలుపుకుంటూ వెళ్లే గుణం తనదని అన్నారు. అందరితో బాగా కలిసిపోతాడని.. ఎవరితోనైనా కుటుంబ సభ్యుడిలా కలిసిపోతాడని అన్నారు. ఎవరైనా దూరంగా ఉన్నా సరే పిలిచి మరీ పలకరించే ఉన్నతమైన లక్షణం, గుణం ఉన్నటువంటి వ్యక్తి తారకరత్న అని అన్నారు. అత్తారింటి వైపు వైసీపీ, పుట్టింటి వైపు టీడీపీ పార్టీ తారకరత్న కోసం రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయని అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకున్నారని, శాసన సభ్యుడు అవ్వాలనుకున్నారని.. అయితే మనం ఒకటి తలిస్తే దేవుడొకటి తలుస్తాడని దురదృష్టం కొద్దీ ఆయన మరణించారని అన్నారు.
తారకరత్న మరణించడం ఆయన కుటుంబ సభ్యులకు, తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. వైసీపీలోకి ఆహ్వానిస్తే.. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని తారకరత్న చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలోనే కొనసాగాలని ఉందన్న అని కొడాలి నానితో తారకరత్న అన్న సందర్భాన్ని గుర్తు చేశారు. తాత గారు పెట్టిన పార్టీ కాబట్టి ఆ పార్టీ నుంచే పోటీ చేస్తానని తారకరత్న అన్నారని వెల్లడించారు. దేనికీ ఆశపడకుండా, ఎన్టీఆర్ మనవడు అయినప్పటికీ తన కష్టాన్ని నమ్ముకుని సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ చూపించిన దారిలోనే నడవాలని తాపత్రయపడ్డారని.. ఆ ప్రయత్నంలోనే ఆయన మరణించారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మరి తారకరత్న వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నా కూడా తాత ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోనే ఉంటానన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.