ఫిల్మ్ డెస్క్- తమిళ నటుడు విజయ్ కి తమిళనాడు అత్యున్నత న్యాయస్థానం మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. విజయ్ విదేశాల నుంచి ఖరీదైన కారును కొనుగోలుచేయగా, ఆ కారుకు సంబందించిన ఎంట్రీ ట్యాక్స్ చెల్లించలేదు. ఇంగ్లాండ్ నుంచి విజయ్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. అత్యంత ఖరీదైన రోల్స్ రాయ్ కారుని ఆయన దిగుమతి చేసుకున్నారు.
విజయ్ కొనుగోలు చేసిన కారు ఖరీదు సుమారు 6 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ కారుకు సంబంధించిన ట్యాక్స్ ని ఆయన చెల్లించలేదు. పైగా తనకు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టుకు పిటీషన్ దాఖలు చేశారు. విజయ్ పిటీషన్ ను మద్రాస్ హైకోర్ట్ కొట్టేసింది. ట్యాక్స్ చెల్లించనందుకు ఆయనకు లక్ష రూపాయల జరిమానా విధించింది.
అంతే కాదు రీల్ హీరోలు ట్యాక్స్ కట్టేందుకు నిరాకరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో విజయ్ తాను విదేశాల నుంచి కొన్న కారుకు ఎంట్రీట్యాక్స్ చెల్లించారు. ఇంతవరకు బాగానే ఉన్నా విచారణ సందర్బంగా ప్రత్యేక న్యాయమూర్తి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను రద్దు చేయాలంటూ విజయ్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది.
నటుడు విజయ్ పై ప్రత్యేక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. మొత్తానికి విజయ్ కు హైకోర్టులో కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు. అన్నట్లు విజయ్ ప్రస్తుతం బీస్ట్ చిత్రంలో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.