బో – ‘పోర్చుగీస్ వాటర్ డాగ్’ జాతికి చెందిన శునకం. ఇది ఒబామాకు గిఫ్ట్‌గా వచ్చింది. 2008 ఎన్నికల్లో ఒబామా ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన సెనేటర్, దివంగత ఎడ్వర్డ్ ఎం కెన్నెడీ.. ‘బో’ను ఒబామాకు కానుకగా ఇచ్చారు. దీంతో ఇద్దరు కూతుళ్లు మాలియా, సాషాకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల తర్వాత వారికి ఓ పెంపుడు శునకాన్ని బో రూపంలో అందించారు ఒబామా. ఈ క్రమంలో 2013లో ఒబామా కుటుంబంలో మరో శునకం ‘సన్నీ’ వచ్చి చేరింది. దాంతో బో, సన్నీ చాలా తక్కువ సమయంలోనే మంచి మిత్రులయ్యాయి. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ఈ రెండు బాగా సందడి చేసేవట. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో ఈ రెండు శునకాలు అతిథులను విపరీతంగా ఆకట్టుకునేవని మిషెలీ అన్నారు. బో మృతి తమను తీవ్రంగా కలిచి వేసిందని, బోతో గడిపిన సమయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని మిషెలీ, ఒబామా తెలిపారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పెంపుడు శునకం ‘బో’.. క్యాన్సర్‌తో పోరాడుతూ శనివారం మృతిచెందింది. ఈ విషయాన్ని ఒబామా, ఆయన భార్య మిషెలీ ఒబామా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా దంపతులిద్దరూ బో మరణంపట్ల విచారం వ్యక్తం చేశారు. ‘నా నిజమైన స్నేహితుడు, నమ్మకమైన సహచరుడిని కోల్పోయానంటూ’ ఒబామా భావోద్వేగానికి లోనయ్యారు. గట్టిగా మొరిగేవాడు.. అంతేగానీ, ఎప్పుడూ కరిచేవాడు కాదని చెప్పారు. ‘బో’ వేసవి కాలంలో స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడానికి ఇష్టపడేవాడని ఒబామా తెలిపారు. “ఇవాళ మా కుటుంబం ఓ నమ్మకమైన మిత్రుడిని, విశ్వాసపరుడైన సహచరుడిని కోల్పోయింది. దశాబ్దానికిపైగా బో మాతోనే గడిపాడు. ప్రతిరోజూ మంచి, చెడులో మా వెంటే ఉన్నాడు. శ్వేతసౌధంలో ఉండే గందరగోళాన్ని అంతా తట్టుకున్నాడని పేర్కొన్నారు.