దేశంలో ప్రస్తుతం ఎటు చూసినా వానలు కుమ్మేస్తున్నాయి. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అతీతం ఏమి కాదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఆగకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షాల కారణంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వణికిపోతోంది.
ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ సిర్పూర్ యు లింగాపూర్ మండలాలలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇళ్లలో నుండి బయటకి రాలేని పరిస్థితిలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఓ దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని వాగులు పొంగి పొర్లడంతో ప్రజలు వాటిని దాటలేక ఎక్కడి వారు అక్కడే ఇరుక్కుని పోయారు. అయితే.. ఓ యువకుడు మాత్రం వరద నీరు ఉదృతంగా పోటెత్తున్న సమయంలో వాగు దాటడానికి ప్రయత్నించి ప్రాణాలను పోగొట్టుకున్నాడు.
వాగుకి అవతల ఉన్న వారు.. యువకుడిని రావద్దని ఎంత చెప్పినా అతను పట్టించుకోలేదు. తాగిన మైకంలో తనకి ఏమి కాదు అనుకుని వరదలోకి దిగేశాడు. సగం దూరం వచ్చాక, వరద ఉదృతిని తట్టుకోలేక, కింద పడిపోయి వాగులోకి కొట్టుకెళ్ళిపోయాడు. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ యువకుడు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
అయితే.., యువకుడు కొట్టుకునిపోతున్న సమయంలో అతన్ని కాపాడటానికి ఎవరు మందికి రాకపోవడం విచారకరమైన విషయం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కళ్ళ ముందే ఓ మనిషి అలా కొట్టుకుని పోవడం అందరిని బాధకి గురి చేస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.