న్యూ ఢిల్లీ- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈనెల 1న కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లిన సీఎం, ఈనెల 2న వసంత్ విహార్ దగ్గర టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గురువారం సాయంత్రం టీఆర్ ఎస్ ఎంపీ బీవీ పాటిల్ నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన భేటీలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ ఎస్ పాత్రపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పలు కీలక అంశాలపై వినతి పత్రాలు అందించారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు సహా పలు విద్యా సంస్థలు, పరిశ్రమల స్థాపనకు సహకరించాలంటూ మోదీకి మొత్తం 10 లేఖలు సమర్పించారు. అందులో ప్రధానంగా వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌కు వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధానిని కోరారు.
ఇక హైదరాబాద్ నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీని కోరారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అభ్యర్ధించారు. రాష్ట్రంలో ఐపీఎస్ సీనియర్ డ్యూటీ పోస్టులు 76 నుంచి 105కు పెంచాలని కోరారు.
మరోవైపు తెలంగాణలో ఐపీఎస్ క్యాడర్ సంఖ్య 139 నుంచి 195కు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్రంలోని 9 జిల్లాల్లో మాత్రమే జవహర్ నవోదయ పాఠశాలలు ఉన్నాయని, మరో 21 జిల్లాలకు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్‌కు ఐఐఎం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లాకు ట్రిపుల్ ఐటీ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి విన్నవించారు.