భారీ అంచనాలతో ఇవాళ విడుదలైన తేజ సజ్జా సినిమా మిరాయ్ అభిమానులకు షాక్ ఇచ్చింది. విడుదలకు ముందే ఫుల్ ట్రెండ్ అయిన పాటను తొలగించారు. సినిమా మొత్తం చూసిన ప్రేక్షకులకు వైబ్ ఉంది పాటెందుకు లేదో అర్ధం కావడం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా కొత్త సినిమా మిరాయ్ పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. భారీ ఆంచనాలతో విడుదలైన ఈ సినిమా సగటు ప్రేక్షకుడికి షాక్ ఇచ్చింది. సినిమా విడుదలకు ముందే వైబ్ ఉంది పాట చాలా హిట్ అయింది. ప్రమోషన్లో కూడా ఇదే పాటను ప్రదర్శించి అంచనాలు పెంచింది చిత్ర యూనిట్. యూట్యూబ్‌లో ఈ పాట ఇంకా ట్రెండ్ అవుతోంది. చాలామంది ఈ పాటను చూసి సినిమాకు వస్తున్నారంటే అతిశయోక్తి కాకపోవచ్చు. కానీ తీరా ధియేటర్‌కు వచ్చాక పాట ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. ఈ ట్రెండింగ్ పాట చివర్లో ఉంటుందేమోననుకుని నిరీక్షించినా ఫలితం లభించలేదు. పాట ఉంటే కదా రావడానికి. ఈ పాటను ఎందుకో దర్శకుడు సినిమా నుంచి తొలగించేశాడు.
వైబ్ ఉంది పాటెందుకు తొలగించారు
మిరాయ్ అనేది ఒక అడ్వెంచరస్ మైథలాజికల్ సినిమా. ఇందులో హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఉన్నా అది కధకు అడ్డం రాదు. కధ మధ్యలో లవ్ ట్రాక్ ఉండదు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు అడ్వెంచర్, యాక్షన్, ఆధ్యాత్మికత ప్రధానంగా సాగుతుంది. హీరో తేజ సజ్జా, హీరోయిన్ రితిక లవ్ ట్రాక్ కధలో భాగంగానే ఉంటుంది తప్ప అదే కధ కాదు. అందుకే గ్రిప్పింగ్‌తో స్టోరీ నడుస్తున్నప్పుడు మధ్యలో పాట పెడితే రెండు సమస్యలుండవచ్చు. అది స్టోరీకు అడ్డుగా రావచ్చు లేదా రొటీన్ ఫార్ములాగా కన్పించవచ్చు. అందుకే కధ మంచి సీరియస్ గా ఉన్నప్పుడు పాటెందుకు అనుకున్నాడు దర్శకుడు. ఇప్పటికే 2 గంటల 50 నిమిషాల సినిమాలో పాట చేర్చితే మరో 6-7 నిమిషాలు నిడివి అనవసరంగా పెరుగుతుంది.
హిట్ అయిన పాటను సినిమా నుంచి తొలగించడం ఇది తొలిసారి కాదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర నుంచి కూడా ఓ పాటను తొలగించి ఆ తరువాత కొద్దిరోజులకు చేర్చిన పరిస్థితి ఉంది. మిరాయ్ సినిమాలో కూడా వైబ్ ఉంది పాటను తిరిగి చేర్చే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయి. అప్పటి వరకూ సగటు ప్రేక్షకుడికి నిరాశ తప్పదు. యూట్యూబ్‌లో ఆ పాట చూసుకుని సంతోషపడాల్సిందే.