మనం ఏ గర్భం నుంచి బయటకొస్తామో… ఆమెను అమ్మా అంటాం! ఆమె ఆడది. మనం చివరకు ఏ మట్టిలో కలిసిపోతామో… ఆమెను భూమాతా అంటాం! ఆమెను కూడా స్త్రీగానే భావిస్తాం! మనిషి ఆది, అంతం, ఆద్యంతాల నడుమ వున్న సర్వస్వం స్త్రీనే! స్త్రీలేకుంటే మగవాడు ఏంటి? ఈ విశాల విశ్వం కూడా ఒంటరే! ఆమె తల్లిగా, చెల్లిగా, చెలిగా చేయిపట్టుకుని తోడుగా ఉంది కాబట్టే…, ఆమెకి ధైర్యం చెబుతున్నానన్న భ్రమలో మగవాడు ధైర్యంగా జీవించేస్తున్నాడు! లేకపోతే అసలు పరిస్థితి ఏంటి? పుట్టగానే మొదలైన ఏడుపు అసలు జీవితాంతం శాంతిస్తుందా? అందుకే, స్త్రీ ఒక స్వాంతన… సృష్టికంతటికీ దేవుడు ఆధారంగా ఇచ్చినా సారం! మరి అంత గొప్ప స్త్రీని ప్రతీ ఒక్కరూ ఎందుకు గౌరవించి తీరాలో ఒకసారి చూద్దామా…
1. ఆడవార్ని గౌరవించి తీరాలి…. ఎందుకంటే, గౌరవించటానికి అసలు మనం ఉన్నామంటే… ఆమె పురిటి నొప్పులు భరించి ప్రాణాలు పణంగా పెట్టి మనల్ని కన్నది కాబట్టి!
2. ఏడవటం తప్ప ఏమీ చేతకాని మనకి నెలల తరబడి తన రక్తాన్ని పాలుగా తాగించి బతికిస్తుంది కాబట్టి! ఆ అమ్మ పాలే లేకపోతే మనం మృత్యువు పాలవటం తప్ప చేసేదేముంది?
3. నడవటం, నమలటం, మాట్లాడటం… ఇవన్నీ నేర్పే తొలి గురువు ఆడదే! ఆమె అవి నేర్పించకుంటే తరువాత సంపాదించే సర్టిఫికెట్లు, ఉద్యోగాలు ఎలా సాధ్యం అవుతాయి?
4. అమ్మని, నాన్నని, ఇంటిని వదిలేసి.., తాను మరో ఇంటికి వెళ్లిపోయే అక్కో, చెల్లో కూడా స్త్రీనే! నీతో ఉన్నప్పుడు నిన్ను ప్రేమించే, నీకు దూరంగా వెళ్లిపోయినప్పుడు నిన్ను మరింత ప్రేమించే… తొబుట్టువును గౌరవించకపోతే ఇంకెవర్ని గౌరవించాలి?
5. అమ్మని, నాన్నని, ఇంటిని, ఇంటి పేరుని కూడా వదిలేసి నీకోసం తాను వస్తుంది! ఇన్నీ త్యాగం చేసి కూడా ఆమే నిన్ను గెలుచుకున్నానని మురిసిపోతుంది. నిజానికి నీకు భార్య అయ్యాక.. తనవంటూ ఏమీ మిగుల్చుకోలేదని అర్థం చేసుకోలేకపోతుంది! అంత అమాయకురాలికి కాక మరెవరికి గౌరవం ఇవ్వాలి?
6. కొన్నాళ్ల తరువాత, కొన్నేళ్ల తరువాత నువ్వు తనని వేరే కుటుంబంలోకి, వేరే ప్రపంచంలోకి, వీలైతే వేరే దేశానికే… పెళ్లి చేసి పంపుతావని తెలిసినా… ఏ స్వార్థం లేకుండా ప్రేమించే కూతురి ప్రేమని ఎలా అర్థం చేసుకోగలం? వీలైనంత గౌరవించి తరించటం తప్పా!
7. నీకు అత్యంత పురాతన వేదాల్ని, అత్యంత మనోహరమైన హిమాలయాల్ని, ఆ హిమాలయల నుంచీ హిందూ మహా సముద్రం వరకున్న లోయల్ని, కొండల్ని, వాగుల్ని, వంకల్ని, పువ్వుల్ని, రెమ్మల్ని, కొమ్మల్ని, చెట్లనీ, చేమల్ని, భాషల్ని, భావాల్ని, పండగలని, వంటకాల్ని, దుస్తుల్ని, సంస్కృతిని… ఇన్నిట్ని, ఇంకా బోలెడన్నిట్ని… ఇచ్చిన భరతమాత అనే స్త్రీని గౌరవించటం మినహా మనం ఏం చేయగలం?
8. గాలి బయటకి.., లోపలికి ప్రవహిస్తున్నంత కాలం మనిషి గాల్లో తేలిపోతుంటాడు. నావారు, నాది అంటూ భ్రమిస్తుంటాడు. అజ్ఞానంలో రమిస్తుంటాడు. కాని, ఆ గాలి ఒక్కసారి ఆగితే… అంతే! అప్పటిదాకా మనిషివి అన్న వారే శవానివంటారు! ఆరడుగుల లోతున అనంతకాలాల పాటూ ఉండిపొమ్మంటూ ఒంటరిగా వదిలేస్తారు! అప్పుడూ మనల్ని కాదనక ఒడిలోకి తీసుకుంటుంది భూమాత! ఆ స్త్రీమూర్తికి బతికుండగా ఏమివ్వగలం? గౌరవించటం తప్పా!
9. ఆత్మ ఉందొ లేదో..? లేకుంటే ఏ బెంగా లేదు! ఒకవేళ ఉంటే మాత్రం ఆకారం లేని ఆత్మని ఆత్మీయంగా లాలించే అమ్మ ఎవరు? పరమాత్మకే సృష్టి చేయమని చైతన్యం కలిగించే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఆమే మనల్ని అందరూ ఉన్నప్పుడూ, ఎవ్వరూ లేనప్పుడూ లాలించేది, పాలించేది, తరింపజేసేది! అన్నీ ఇచ్చే ఆమెకి గౌరవం తప్ప మనం ఇవ్వగలిగేదేముంది? అమ్మా అని ఆర్తిగా అనటం తప్ప అర్పించగలిగేదేముంది?
ఇందుకే స్త్రీని గౌరవిద్దాం. మన కోసం తనవైనవన్నీ ఇచ్చేసే ఆమెకి కనీసం గౌరవాన్ని ఇద్దాం.