ఫిల్మ్ డెస్క్- పుష్ప.. ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప ఇప్పటికే అందరిలో ఆసక్తిని పెంచేసింది. ఇప్పటికే విడుదలైన ‘తగ్గేదే లే’ అనే ఓ ఒక డైలాగ్, ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లి’, ‘సామి’, ‘ఏయ్ బిడ్డా’ అనే నాలుగు పాటలు పుష్ప సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి.
ఇదిగో ఇప్పుడా జాబితాలోకి ట్రైలర్ వచ్చి చేరింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఎట్టకేలకు పుష్ప ట్రైలర్ సోమవారం విడుదలైంది. ఈ ట్రైలర్ చిత్రంపై ఉన్న అంచనాల్ని మరింత పెంచేలా ఉంది. సినిమాలో అల్లు అర్జున్ సహా మిగతా పాత్రలను తీర్చిదిద్దిన తీరు, అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలు అందరిని అలరిస్తున్నాయి.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పుష్ప ట్రైలర్ కు ఆయువుపట్టుగా నిలిచిందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ హంగులన్నీ ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తోంది. అన్నట్లు పుష్పలో కన్నడ సోయగం రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ మలయాళి నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప మూవీని ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రెండు భాగాలుగా నిర్మిస్తోంది. ‘ది రైజ్’ పేరుతో మొదటి భాగం డిసెంబరు 17న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పుష్ప ట్రైలర్ విడుదలైన గంటల్లోనే యూట్యూబ్ లో పది లక్షల వీవ్స్ తో దూసుకుపోతోంది.
