ఫిల్మ్ డెస్క్- తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ఈనెల 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఎవరికి వారు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానెల్, సీవీఎల్ నరసింహా రావు ప్యానెల్ లు పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంగా తనకు ప్రధాన పోటీదారుడైన మంచు విష్ణుపై ప్రకాష్ రాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా అని ప్రశ్నించిన ప్రకాశ్ రాజ్, ఆయన ప్రసంగాన్ని విశ్లేషించాలని అన్నారు. పవన్ కళ్యామ్ మొదటి సినీ నటుడని, ఆ తర్వాతే రాజకీయ నాయకుడని చెప్పారు. మంచు విష్ణు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించిన ప్రకాష్ రాజ్, పవన్‌కల్యాణ్ మార్నింగ్ షో కలెక్షనంత లేదు మీ సినిమా బడ్జెట్ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
మనం ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంచు విష్ణుకు హితువు పలికారు ప్రకాష్ రాజ్. మీకేమైనా పొలిటికల్ అజెండా ఉంటే మీరు చూసుకోండి, ఇండస్ట్రీని మాత్రం పాలిటిక్స్ లోకి లాగొద్దని అన్నారు. పవన్ కళ్యాణ్ సినీ నటుడని, ఆయన రాజకీయ అజెండా మాకొద్దని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఇక మా ఎన్నికల్లోకి సీఎం జగన్‌ను లాగొద్దన్న ప్రకాష్ రాజ్, ఆయన పాదయాత్ర చేసి, ప్రజల మనసు గెలుచుకుని ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు.
అటు సీఎం కేసీఆర్ ఉద్యమం చేసి, ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనకు చాలా పనులున్నాయని, మా ఎన్నికల్లోకి వాళ్లిద్దరి పేర్లు ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. మీరు పవన్ కల్యాణ్ వైపు ఉన్నారా, లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా.. అని మంచు విష్ణు ప్రశ్నించడం బాగోలేదని, పవన్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా అని ప్రకాశ్‌రాజ్ ప్రశ్నించారు. పవన్ కు. తవకు సిద్ధాంత పరంగా విభేదాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయాన్ని పవన్ స్వయంగా చెప్పారని గుర్తు చేసిన ప్రకాష్ రాజ్, సినిమా విషయానికొస్తే నేను నంద.. ఆయన బద్రి.. అయిపోయిందంతే అని తనదైన స్టైల్లో చెప్పారు.