ఇతని వయసు 35 ఏళ్లు. పెళ్లి వయసు దాటిపోయిన ఇతనికి పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక నాకు పెళ్లి కాదేమోనని ఈ యువకుడు ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు.
నేటి కాలంలో కొందరు యువకులు మూడు పదుల వయసు దాటిన పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. పెళ్లి వయసు దాటిపోతున్నా.. పెళ్లి చేసుకోవడానికి అనేక ఆలోచనలు చేస్తున్నారు. కొందరు చదువు పేరుతో ఆలస్యం చేస్తుంటే.. మరి కొందరు జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ, ఓ యువకుడు మాత్రం పెళ్లి వయసు వచ్చినా వివాహం కావడం లేదని ఇటీవల ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక యల్లాపూర్ కిరగారిమానెలో నాగరాజు (35) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి సొంత ఊరిలో కొంత వ్యవసాయ భూమి ఉండడంతో వ్యవసాయం చేస్తున్నాడు. అయితే మూడు పదుల వయసు దాటినా ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఇకపోతే, నాగరాజుకు పెళ్లి చేయాలని ఇతని తల్లిదండ్రులు గత కొంత కాలంగా అమ్మాయిని చూస్తున్నారు. కానీ, సంబంధాలు వచ్చినట్టే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్తున్నాయి.
ఎందుకని తెలుసుకోగా.. అతనికి మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయ భూమి ఉండడం కారణంగానే ఎవరూ పిల్లను ఇవ్వడానికి ముందుకు రావడం లేదట. ఇతని స్నేహితులు కూడా నాగరాజును హేళన చేయడం మొదలు పెట్టారు. ఇవన్నీ జీర్ణించుకోలేని నాగరాజు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇక ఈ జన్మలో నాకు పెళ్లి కాదని భావించిన ఆ యువకుడు.. ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.