గత కొంత కాలంగా పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ తన సీఎం పదవికి ఇటీవల రాజీనామా చేయగా, తాజాగా పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. పంజాబ్ సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్ విషయంలో రాజీపడబోనంటూ లేఖ రాసి పార్టీ అధిష్టానానికి పంపారు. అయితే కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సిద్ధూకు కొంత కాలం క్రితమే పంజాబ్ పీసీసీ పదవిని అధిష్టానం కట్టబెట్టింది.
ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తన అనుయాయులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తి కారణంగానే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. అయితే తన రాజీనామా లేఖలో పరోక్షంగా అమరీందర్ సింగ్‌ను వ్యవహరాన్ని ప్రస్తావించారు. యన స్వలాభం కోసం పంజాబ్ భవిష్యత్తు, ప్రజల సంక్షేమంపట్ల వివక్షతకు పాల్పడుతున్నారని అన్నారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నానని వివరించారు.మరోవైపు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది.
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సాయంత్రం అమరీందర్ భేటీ అవుతారన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరి అమరీందర్ భాజపాలోకి వెళ్తారా లేదో చూడాలి. ఇదిలా ఉంటే.. 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా చేయడం వంటి పరిణామాలు పంజాబ్ రాజకీయాలను మరింత వేడెక్కించాయి.
Punjab Congress chief Navjot Singh Sidhu resigns pic.twitter.com/KbDbderXeo
— ANI (@ANI) September 28, 2021