మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఆదాయ పన్ను శాఖ అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. గత కొంత కాలంగా ఎన్సీపీకి ఐటీ ఈడీ తాజాగా షాకుల మీద షాకులు ఇచ్చాయి. ఇప్పటికే మాజీ హోంమంత్రిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మరోసారి పంజా విసిరారు. ఎన్సీపీ నుంచి మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ కు హైఓల్టేజ్ షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన ఆస్తులను భారీగా అటాచ్ చేశారు ఐటీశాఖ అధికారులు. అటాచ్ చేసిన ఈ ఆస్తుల విలువ 1000 కోట్ల రూపాయలు.
తాజాగా జప్తు చేసిన ఆస్తుల్లో ఒక్క జరందేశ్వర్ కోఆపరేటివ్ చక్కెర కర్మాగారం విలువే రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. ఇది సతారాలో ఉంది. ఇది మాత్రమే కాదు.. కాకుండా అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ కు చెందిన కార్యాలయం (రూ.25 కోట్లు), సౌత్ ఢిల్లీలో ఓ ఖరీదైన ఫ్లాట్ (రూ.20 కోట్లు), ముంబయి నారిమన్ పాయింట్ లోని నిర్మల్ టవర్ తో పాటు గోవాలోని ఓ రిసార్టు సహా పలు ఆస్తులను ఐటీ అధికారులు జప్తు చేశారు.
అజిత్ పవార్ భారీ ఆస్తులను ఐటీశాఖ అధికారులు అటాచ్ చేయడం కలకలం రేపింది. సంకీర్ణ కూటమి నాయకులను ఇది ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది. బినామీ ప్రాపర్టీల కింద వాటిని అటాచ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. బినామీ పేర్లతో వేర్వేరు రాష్ట్రాల్లో అజిత్ పవార్ కు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. మరోవైపు అజిత్ పవార్ తోబుట్టువులు, సన్నిహితుల ఇళ్లు, సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేయగా… కేంద్రం కావాలనే తమపై దాడులు చేయిస్తోందని అజిత్ పవార్ ఆరోపించారు. తాము పన్నులు సక్రమంగానే చెల్లిస్తున్నామని అన్నారు.