వారం రోజుల క్రితం మహిళా నేత కనబడకుండా పోయింది. ఆమె సాధారణ మహిళ కాదు. కుటుంబ సభ్యులు కూడా వేరే రాష్ట్రానికి వెళ్లి అనేక ప్రయాసలు పడి ఆమె కోసం వెతికారు. కానీ ఆచూకీ దొరకలేదు. కానీ పోలీసులు ఆమె ఆచూకీ కనుగొన్నారు.
వారం క్రితం మిస్ అయిన బీజేపీ మహారాష్ట్ర మైనార్టీ వింగ్ ఛీఫ్ సనా ఖాన్ అలియాస్ హీనా కేసుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు పోలీసులు. సనా ఖాన్ ని ఆమె భర్త చంపాడని పోలీసులు తెలిపారు. జబల్పూర్, నాగపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ప్రధాన నిందితుడైన అమిత్ అలియాస్ పప్పు సాహుని పట్టుకున్నారు. నాగపూర్ నుంచి అమిత్ ను కలిసేందుకు సనా ఖాన్ మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ కి వెళ్లారు. రెండు రోజుల్లో తిరిగి ఇంటికి రావాలని ఆమె అనుకున్నారు. అయితే ఆమె రాలేదు. అమిత్ జబల్పూర్ లోని రోడ్డు పక్కన తినుబండారాల దుకాణం నడుపుతాడు. లిక్కర్ స్మగ్లింగ్ వ్యాపారంలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అయితే సనా, అమిత్ ల మధ్య కొన్ని రోజులుగా ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు కొనసాగుతున్నాయి. విచారణలో అమిత్ సనాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సనా ఇంటిలో ఆమెను చచ్చేలా కొట్టినట్లు వెల్లడించాడు. ఆమె చనిపోవడంతో మృతదేహాన్ని జబల్పూర్ కి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరణ్ నదిలో విసిరేసినట్లు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. అమిత్, సనా ఇద్దరూ భార్యాభర్తలు.. చాలా కాలంగా ఇద్దరి మధ్య డబ్బు విషయంలో గొడవలు ఉన్నాయి. అమిత్ ని కలిసి మాట్లాడేందుకు సనా నాగపూర్ నుంచి జబల్పూర్ వెళ్లిందని.. అప్పుడే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
దీంతో ఆగ్రహానికి గురైన అమిత్.. సనా తల మీద కొట్టడంతో ఆమె చనిపోయిందని తెలిపారు. ఈ హత్య కేసులో వేరే వ్యక్తి కూడా ఉన్నాడని.. ఆ వ్యక్తిని వెతుకుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం సనాని హత్య చేసిన ప్రధాన నిందితుడు అమిత్ ని విచారిస్తున్నారు. నాగపూర్ నుంచి జబల్పూర్ కి సనా ఆగస్టు 2న వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆమె కనబడకుండా పోయింది. ఆమెను వెతికేందుకు కుటుంబ సభ్యులు నాగపూర్ నుంచి జబల్పూర్ వచ్చారు. ఆమె కోసం ఎంత వెతికినా గానీ సనా ఆచూకీ దొరకలేదు. నాగపూర్, జబల్పూర్ పోలీసులు ఈ కేసుకి సంబంధించి విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. లాస్ట్ ఫోన్ కాల్ ఆధారంగా ఆమె అమిత్ ని కలిసినట్లు తెలుసుకున్నారు. అమిత్ ని అదుపులోకి తీసుకుని విచారించగా చంపేసి నదిలో పడేసినట్లు ఒప్పుకున్నాడు.