సాధారణంగా గర్భిణీ మహిళలకు సీమంత వేడుక నిర్వహిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఆవు వంటి మూగ జీవాలకు కూడా ఈ వేడుక నిర్వహిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి గాడిద వచ్చి చేరింది. ఓ ప్రాంతంలోని గ్రామస్తులు గర్భం దాల్చిన గాడిదలకు సీమంతం, గాడిద పిల్లలకు బారసాల చేస్తున్నారు. అయితే అందుకో కారణం ఉంది.
సాధారణంగా గర్భిణీ మహిళలకు వారి కుటుంబ సభ్యులు సీమంత వేడుక నిర్వహిస్తారు. బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ ఆ మహిళను, ఆమె కడుపులో ఉన్న బిడ్డను ఆశీర్వదిస్తారు. ఇలా ఆడవారికి సీమంతం చేయడం మనందరికి తెలిసిందే. అయితే జంతువులకు ముఖ్యంగా గాడిదలకు సీమంతం చేయడం ఎక్కడైనా చూశారా? అలా కూడా చేస్తారా? అని ఆశ్చర్యపోకండి. గుజరాత్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో గాడిదలకు సీమంతం వాటి పిల్లలకు బారసాలా చేస్తున్నారు. మరి.. వారు అలా చేయడానికి ఓ బలమైన కారణం ఉంది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవల ఆవులకు సీమంతాలు, లేగదూడలకు బారసాల కార్యక్రమాలు, గోమాతలను కౌగిలించుకునే కార్యక్రమాలు బాగా పెరిగిపోయాయి. తాజాగా గాడిదలకు కూడా అలాంటి వేడుకలను నిర్వహిస్తున్నారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో గాడిదలకు సామూహిక సీమంతాలు చేశారు. ఈ ప్రాంతంలో హలరీ జాతికి చెందిన గాడిదలకు ఫేమస్. ఎక్కువ పనిచేయడం, ఎంత దూరమైన అలసట లేకుండా ప్రయాణించడం ఈ గాడిదల ప్రత్యేకత. అయితే కాలక్రమేణ వీడి వాడకం తగ్గిపోయింది. అందరూ వాహనాల ద్వారా ప్రయాణాలు చేస్తున్నారు. ఈక్రమంలో హలరీ జాతి గాడిదలకు క్రమేణా తగ్గిపోతున్నాయి.
అంతరించిపోతున్న పలు రకాల జీవ జాతుల్లో హలరీ గాడిదలు కూడా చేరాయి. ప్రస్తుతం పాల కోసం మాత్రం అక్కడక్కడా వీటిని పెంచుతున్నారు. అయితే హలరీ జాతి గాడిదలను కాపాడటం కోసం రాజ్ కోట్ ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలు నడుం బిగించారు. కోల్కిగ్రామ ప్రజలు గాడిదలను ప్రత్యేకంగా పెంచుతున్నారు. పుట్టిన గాడిద పిల్లలకు బారసాల చేయడం, గర్భం దాల్చిన గాడిదలకు సీమంతం చేయడం చేస్తుంటారు. ఇటీవలే కోల్కి గ్రామంలో ఓ గాడిదకి పండంటి బిడ్డ జన్మించింది. ఆ బుల్లి గాడిద పిల్లకు బారసాల చేసి గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. అలానే గర్భం దాల్చిన మరో 33 గాడిదలకు సీమంతం కూడా చేశారు. నుదుట బొట్టు పెట్టి, కొత్త వస్త్రాలు కప్పారు.
మహిళలు పూజలు చేసి, ప్రత్యేక ఆహారం పెట్టారు. ఈ వేడుకను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అలానే కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ఈ సీమంతం వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం దేశంలో హలరీ గాడిదల సంఖ్య సుమారు 417 మాత్రమే ఉన్నట్లు సమాచారం. వీటిని కాపాడేందుకు ముందుకు వస్తున్నట్లు వివిధ స్వచ్ఛంద సంస్థలు వెల్లడించాయి. మరి.. ఇలా గాడిదలకు సీమంతం చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.