కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పండిట్ సుఖ్ రామ్(94) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మే4వ తేదీన సుఖ్ రామ్ మనాలిలో బ్రెయిన్ స్ట్రోక్ కు గురవ్వగా.. అక్కడ మండిలోని ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్చారు. మరింత మెరుగైన చికిత్స కోసం ఈ నెల 7న ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చామని ఆయన మనవడు ఆశ్రయ్ శర్మ గత రాత్రి ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు. ఢిల్లీకి తరలించేందుకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ప్రభుత్వ హెలికాప్టర్‌ను పంపారు.
ఇక హిమాచల్ ప్రదేశ్ పశుసంవర్థకశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన జర్మనీ నుంచి ఆవులను దిగుమతి చేయించి పాడి రైతులకు మంచి లాభాలు వచ్చే విధంగా చేశారు. అంతేకాదు పాడి పరిశ్రమలు ఎంతగానో అభివృద్ది చెందేలా చేశారు. 1993 నుంచి 1996 వరకు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రిగా పనిచేసిన సుఖ్‌రామ్. హిమాచల్ ప్రదేశ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేతగా ఆయన ఎంతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. సుఖ్‌రామ్ మనవడైన ఆయుష్ శర్మ నటుడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరిని ఆయన వివాహం చేసుకున్నారు. సుఖ్ రామ్ మృతిపై పలువురు రాజకీయ నేతలు సంతాపాన్ని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.