దీపావళి అంటే కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా జరుపుకునే పండగ. హిందువులు ఎక్కడ ఉన్నా.. దీపావళి పండగ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం సాధించినదానికి గుర్తుగా దీపావళి పండుగను వైభవంగా జరుపుకుంటారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఆ రోజు పటాసులు కాలుస్తూ తెగ ఎంజాయ్ చేస్తారు.. మహిళలు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తుంటారు. సాధారణంగా పండుగ అనగానే బంధు మిత్రులను ఆహ్వానించడం.. కుటుంబ సభ్యుల కొత్త బట్టలు, పిండి వంటకాలు ఇలా ఖర్చులు ఎన్నో ఉంటుంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు దీపావళి కానుకగా తమ ఉద్యోగుల కోసం బహుమతులు, ముందుగానే జీతాలు చెల్లింపు లాంటివి చేస్తుంటాయి.
దీపావళి పండుగ ఇంకా వారం రోజులు లేదు. ఇప్పటి నుంచి పండుగ హడావుడి మొదలైంది.. కుటుంబ సభ్యులు అన్నీ రెడీ చేసుకోవడానికి డబ్బు ఎంతో అవసరం ఉంటుంది. అయితే ఈ నెల జీతం వచ్చే నెల వరకు వస్తుంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా బీహార్ ప్రభుత్వం ఒక వినూత్నమైన ఆలోచన ఆలోచించింది. తమ ప్రభుత్వ ఉద్యోగులకు కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈసారి పండుగకు ముందే జీతాలు వారి అకౌంట్స్ లో జమచేసేందుకు సిద్దమైంది.
ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈసారి బీహార్ ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం తీసుకుందని.. అక్టోబర్ నెలకు చెల్లించాల్సిన జీతం ముందుగానే ఈ నెల 20 వ తేదీనే అందిస్తున్నామని తెలపడానికి ఎంతో సంతోషిస్తున్నామని అన్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఎలాంటి పండుగలు సంతోషంగా జరుపుకోలేదు. ఈ సారి కరోనా తగ్గు ముఖం పట్టడంతో దేశంలో దీపావళి పండుగ ఘనంగా జరుపుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఉద్యోగులకు సహాయంగా ఉంటుందని ముందుగానే జీతాలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.