సొసైటీలో ఎక్కడో ఓచోట నిత్యం మహిళలపై దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీహార్ లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. నవవధువుపై అత్తింటివారు దాడికి పాల్పడ్డారు.
ఈ మధ్య కాలంలో మహిళలపై అఘాయిత్యాలు, దాడులు పెరిగిపోయాయి. ప్రేమ పేరుతో వంచించి దారుణాలకు ఒడికడుతున్నారు కొందరు దుర్మార్గులు. మరికొందరు పెళ్లి తర్వాత కూడా వివిధ కారణాలతో ప్రాణాలు తీస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నా ఆ తల్లిదండ్రులకు తీరని దుఖాన్ని మిగుల్చుతున్నారు. వేద మంత్రాల సాక్షిగా నూరేళ్లు కలిసుంటానని ప్రమాణం చేసి తాళి కట్టిన భర్త భార్యలపట్ల కాలయములవుతున్నారు. నూరేళ్ల జీవితం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోంది. ఇదే కోవాకు చెందిన విషయంలో ఓ భర్త పెళ్లైన నాలుగు నెలలకే తన వక్రబుద్దిని బయటపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
బిహార్ రాష్ట్రంలో ఓ నవవధువు ప్రాణాలు తీసిన విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సివాన్ జిల్లా సవ్నా గ్రామానికి చెందిన శంభు శరన్ ప్రసాద్ కూతురు నిశా కుమారిని లాపుర్ గ్రామానికి చెందిన ముకేశ్ కుమార్కు ఇచ్చి ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. కొన్ని నెలల కాపురం తర్వాత వరుడు ముకేశ్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. అధనపు కట్నంగా రూ. 10 లక్షలు తీసుకురావాలని నిశాకుమారిని వేధించ సాగాడు. భర్తతోపాటు అత్తింటి వారుకూడా సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేశారు. ఇదే కాక ముకేశ్ కు మరో మహిళతో వివాహేతర సంబంధం కూడా ఉన్నట్లు నిశాకుమారికి తెలిసింది. ఈ విషయమై భర్తను ప్రశ్నించగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు.
అత్తింటి వారు భర్త కలిసి నవవధువు నిశాకుమారిని హతమార్చారు. హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఇరుగు పొరుగు వారు నిశా కుమారి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. తీవ్ర ఆగ్రహంతో వరుడి ఇంటిపై విరుచుకుపడ్డారు. ఆమె మృతదేహాన్ని వారి ఇంటిముందే దహనం చేసేందుకు సిద్దమయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిశా కుమారి తల్లిదండ్రులకు సర్ది చెప్పారు. డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిశా కుమారి హత్యకు కారకులైన అత్తింటి వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.