ఈ మద్య కొంతమంది యువతీ యువకులు చేస్తున్న పనుల వల్ల తల్లిదండ్రులు తల దించుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఎంతో నమ్మకంతో తమ పిల్లలకు స్వేచ్ఛ ఇస్తే.. వాళ్లు మాత్రం తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు నడుపుతుంటారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసి వారి జీవితాలతో ఆడుకునే మగరాయుళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకే ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కానీ కొంత మంది అమ్మాయిలు మాత్రం ప్రేమ పేరుతో అబ్బాయిల మోజులో పడిపోయి చాటు మాటు వ్యవహారాలు నడిపిస్తుంటారు.
ఓ అమ్మాయి యువకుడితో తిరగడం చూసి తండ్రి సహించలేకపోయాడు.. అక్కడే తన బెల్టు విప్పి ఇద్దరినీ చావ చితకబాదాడు. అందుకు అతని స్నేహితుడు కూడా సహకరించాడు. ఈ సందర్భంగా అక్కడున్నవారు ఈ ఘటనను వీడియోలో బంధించారు… అది కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటన అక్టోబరు 11న మధ్యాహ్నం హర్దా పరిధిలోని ఖెరీనీమా రోడ్డు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. చార్ఖెడ్ నివాసి యశ్వంత్ 24 ఏళ్ల యువతితో బైక్ మీద తిరుగుతున్నాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న యువతి తండ్రి కంట వీరిద్దరూ పడటంతో అనుమానం కలిగిన ఆయన వారిపై బెల్టుతో దాడి చేశారు.
ఈ సంఘటనను అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరుసటి రోజు బాధిత యువకుడు తనపై దాడిచేసిన ఆ యువతి తండ్రి రామ్‌సేవక్, ఖిడికీవాలపై టిమరిన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనను చంపేస్తామని కూడా బెదిరించారని ఆ యువకుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతి తండ్రితో పాటు అతనికి సహకరించిన మరోవ్యక్తిని అరెస్టు చేశారు. ట్విస్ట్ ఏంటంటే.. అతను తన స్నేహితుడని, సోదరునిలాంటివాడని చెబుతోంది ఆ యువతి. అయినప్పటికీ ఆమె తండ్రి ఆమె మాట పట్టించుకోకుండా యువకుడిపై దాడి చేశాడు. యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.