మణిపూర్ లో చోటుచేసుకున్న హింస దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మృగాళ్లుగా మారిన అల్లరిమూక మహిళలపై దారుణాలకు ఒడిగట్టారు. మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో మహిళాలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
గత కొద్ది నెలల క్రితం మణిపూర్ లో చోటుచేసుకున్న ఘర్షనలు తీవ్ర ఉద్రక్తతలకు దారితీశాయి. అక్కడ నివసిస్తున్న తెగల మధ్య తలెత్తిన వివాదం మారణహోమానికి దారితీసింది. మనుషులం అన్న సంగతి మరిచి అమానుషంగా వ్యవహరించిన తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. గత కొంత కాలంగా మణిపూర్ లో నివసిస్తున్న మైతీ, కుకీ, నాగ తెగల మధ్య రిజర్వేషన్ విషయంలో రాజుకున్న వివాదం రక్తపాతానికి దారితీసింది. మైతీ వర్గం కుకీ తెగకు చెందిన మహిళలపై అరాచకాలకు పాల్పడిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ తల్లి తన కూతురి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో తనకెదురైన ఘటనను వెల్లడించింది.
మణిపూర్ లో జరిగిన ఘర్షనల్లో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని అక్కడి స్థానికులు ఆరోపిస్తున్నారు. మైతీ వర్గానికి చెందిన అల్లరి మూక రెండు నెలలక్రితం కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను ఓ యువతిని బలవంతంగా బట్టలు విప్పించి ఊరేగించి అమానుషంగా వ్యవహరించిన వీడియో ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. ఆ అల్లరిమూక అంతటితో ఆగకుండా 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరోచోట ఓ వ్యక్తి తల నరికి తడికెకు వేలాడదీసారు. ఈ హింసాత్మక ఘటనల్లో ఊహకందని అమానుష సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా తాజాగా ఓ మహిళ తన కూతురు ఆచూకీ కోసం జవహర్ లాలా నెహ్రూ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ కి ఫోన్ చేయగా అక్కడి సిబ్బంది.. సజీవంగా కావాలా?.. నిర్జీవంగా కావాలా?.. అని చెప్పేసరికి తనకు ఊపిరిపోయినంతా పనైందని చెప్పింది.
జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ ఆసుపత్రిలో ఘర్షనల్లో గాయపడిన బాధితులు ఉన్నారన్న సమాచారంమేరకు ఫోన్ చేయగా తన కూతురు చనిపోయిందన్న విషయం వెల్లడించారని ఆ మహిళ తెలిపింది. కార్ వాషింగ్ షోరూంలో హత్యాచారానికి గురైన యువతుల్లో తన కూతురు ఉందని తెలిసి క్షోభకు గురయ్యానని ఆ మహిళ తెలిపింది. తన కూతురు చనిపోయిన విషయం కుటుంబ సభ్యులందరికి తెలిసినా తను హార్ట్ పేషెంట్ కావడంతో చెప్పకుండా గోప్యంగా ఉంచారని చెప్పింది. తమ కూతరి మృతదేహం తమకు ఇంకా అందలేదని కన్నీటిపర్యాంతమైంది. ఇక పార్లమెంట్ సమావేశాలకు ముందు ఈ ఘటనలు వెలుగులోకి రావడంతో ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ దేశవ్యాప్తంగా ఆంళనలు నెలకొంటున్నాయి.