జీవితంలో ఏ తప్పు చేసినా చట్టం ముందు తల వంచాల్సిందే.. తప్పు చేసిన వారు ఎక్కడికీ తప్పించుకోలేరు అని అంటారు. సాధారణంగా కొన్ని కేసుల్లో కోర్టు తీర్పు రావడానికి ఏళ్ల సమయం పడుతుందని అంటుంటారు.
తప్పు చేసిన వారు చట్టం ముందు తప్పించుకోలేరు.. ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే అంటారు. కొన్ని కేసులు సంవత్సరాల తరబడి కోర్టులో వాయిదాలు పడుతూ వచ్చినప్పటికీ మొత్తానికి బాధితులకు న్యాయం జరుగుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 42 సంవత్సాల తర్వాత ఓ హత్య కేసులో సంచల తీర్పు వచ్చింది.. ముద్దాయికి శిక్ష విధించింది కోర్టు. ప్రస్తుతం ఆ ముద్దాయి వయసు 90 సంవత్సరాలు. అయినా తొంభై ఏళ్ల వృద్దుడిపై హత్య, హత్యాయత్నం కేసులు ఏంటా అని ఆశ్చర్యపోతున్నారు.. కాకపోతే ఇది ఇప్పటి కేసు కాదు.. దాదాపు 42 ఏళ్ల క్రితం జరిగిన పదిమంది దళితుల హత్యకు సంబంధించిన కేసు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ వృద్దుడు చేసిన నేరం ఏంటీ అన్న విషయం గురించి తెలుసుకుందాం..
ఉత్తర్ ప్రదేశ్ మణిపురి జిల్లాకు చెందిన సాధూపూర్ లో 1981 లో పది మంది దళితులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సాధూపూర్ లో రేషన్ డీలర్ గా ఉంటున్న గంగా దయాళ్ తో కొంతమంది దళితులు గొడవకు దిగారు. దీంతో ఆవేశంతో గంగా దయాళ్ మరో తొమ్మిదిమందిని వెంటబెట్టుకొని దళితుల మీదకు వెళ్లాడు. ఆ సమయంలో విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో పదిమంది దళితులు చనిపోయారు. దీంతో కొంతమంది దళితులు గంగా దయాళ్ తో పాటు మరో పదిమందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని హత్యకు పాల్పపడిన వారిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు.. కొన్నాళ్ల తర్వాత వీరు బెయిల్ పై వచ్చారు.
ఈ కేసు విచారణ 42 ఏళ్ల పాటు సాగుతూ వచ్చింది.. ఇంతలో పదిమందిలో అందరూ చనిపోగా ఒక్క గంగా దయాళ్ మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ కేసు రెండేళ్ల క్రితం ఫిరోజాబాద్ కోర్టుకు బదిలీ అయ్యింది. తాజాగా ఈ కేసులో గంగా దయాళ్ ను కోర్టు దోషిగా నిర్దారించింది. హత్యలు జరిగిన చోట గంగా దయాళ్ ఉన్నారని.. ప్రాసిక్యూషన్ వారు నిరూపించడంతో కోర్టు ఆయకు శిక్ష ఖరారు చేసింది. ప్రస్తుతం గంగా దయాళ్ వయసు 90 సంవత్సరాలు. ఆయనకు జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా కూడా విధించింది. హత్యాయత్నానికి సంబంధించిన మరో కేసులో పదేళ్లు, రూ.5 వేల జరిమానా విధించింది. తాజాగా చెరోపక్క పోలీసులు చేతి కర్రతో నిలబడి ఉన్న గంగా దయాళ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.