హైదరాబాద్- ప్రముఖ జ్యోతిష్యులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఇక లేరు. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన జ్యోత్యిష్య పండిత నిపుణులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఆదివారం కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ పంజాగుట్టాలోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఐతే మార్గమధ్యలోనే రామలింగేశ్వర సిద్ధాంతి చనిపోయారని వైద్యులు చెప్పారు. పలు టీవీ కార్యక్రమాల్లో వార ఫలాలు చెబుతూ రామలింగేశ్వర సిద్ధాంతి తెలుగువారికి చేరువయ్యారు. ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి చెప్పే రాశి ఫలాలను తెలుగు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో ఉండే తెలుగువారు సైతం బాగా నమ్ముతారు. సుమారు నలభై సంవత్సరాలుగా జ్యోతిష ఫలితాలు, పంచాంగం ద్వారా అనేక విషయాలను ప్రజలకు తెలియజేశారు.
ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు, దేశ విదేశాల నుంచి వచ్చేవారికి జాతక విశ్లేషణ చేసి వారి సమస్యలకు పరిష్కారాలు చెప్పారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి, వేదాల్లో, పూజా, హోమాది క్రతువుల్లో శిక్షణ పొందిన బ్రాహ్మణులతో ప్రతీమాస శివరాత్రికి పాశుపతహోమాలు నిర్వహిస్తూవచ్చారు. ములుగు మృతి పట్ల పరువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.