వచ్చే ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇప్పుడే జోస్యం చెప్పేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అటు బీఆర్ఎస్ వర్గాల్లో ఇటు ప్రతిపక్షాల్లో కూడా పెద్దఎత్తున చర్చకు దారి తీశాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని చెబుతూనే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మాత్రం మార్చాలంటూ వ్యాఖ్యానించారు. మరి.. ఆ ఎమ్మెల్యేలు ఎవరు? వారిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎంటి? అనే విషయాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ నెల 18న ఖమ్మంలో 5 లక్షల మందితో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ తలపెట్టిన విషయం తెలిసిందే. దీనికోసం జన సమీకరణకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డోర్నకల్ లో పర్యటిస్తున్నారు. సోమవారం నాడు మంత్రి నర్సింహులుపేటలో బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడం పక్కా అంటూ మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 75 నుంచి 100 సీట్లు గెలవడం ఖాయమంటూ చెప్పుకొచ్చారు.
“రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కు తిరుగులేదు. వచ్చే ఎన్నికల్లో కూడా మన పార్టీనే విజయం సాధిస్తుంది. తిరిగి అధికారం చేపడుతుంది. బీజేపీకి గ్రౌండ్ లెవల్లో బేస్ లేదు. ఖమ్మంలో అయితే మనకు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పోటీ ఉంటుంది. బీజేపీతో 25 స్థానాలు, కాంగ్రెస్ తో 25 స్థానాల్లో మాత్రమే మనకి పోటీ. రాష్ట్రవ్యాప్తంగా ఉండేఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. సాధారణంగా జరిగే సర్వేలు కానివ్వండి.. నేను వ్యక్తిగతంగా చేయించే సర్వేలు కానివ్వండి మన పార్టీ 75 నుంచి 100 సీట్లు గెలవడం పెద్ద విషయమేమీ కాదు. కానీ, 17 నుంచి 20 మంది ఎమ్మెల్యేలపై కాస్త వ్యతిరేకత ఉంది.
వచ్చే ఎన్నికల్లో ఆ 20 మందిని మారిస్తే మాత్రం 100 సీట్లు గెలవడం ఖాయం” అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. అయితే గతంలోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని వార్తలు వచ్చిన విషయంతెలిసిందే. ఇప్పుడు అధికార పార్టీ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా పెద్దఎత్తున చర్చకు దారితీసింది. అయితే ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ఎందుకు వారిపై వ్యతిరేకత ఉంది? ఆ వ్యతిరేకతను తగ్గించే మార్గాలు ఏంటి? లేక నిజంగానే వచ్చే ఎన్నికల్లో వారిని తప్పిస్తారా? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.