ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో ప్రాణాంతక వైరస్. మార్‌బర్గ్ వైరస్ గా పిలవబడుతున్న ఈ వైరస్ సోకిన వ్యక్తులు తీవ్ర జ్వరం బారిన పడి రక్తనాళాలు చిట్లి మరణించే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తోంది. అందులోనూ.. ఈ వైరస్ సోకిన 8 నుంచి 9 రోజుల్లోనే మరణానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మూడేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ సృష్టించిన మృత్యు ప్రళయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణించగా, మరెందరో అయినవారిని కోల్పోయి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడిప్పుడే దాని నుంచే బయటపడుతున్నాం.. అనుకుంటున్న సమయంలో మరో వైరస్ విజృంభిస్తోంది. ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ ఫ్యామిలీ నుంచి ఈ కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఈ ప్రాణాంతక వైరస్ పేరు.. ‘మార్‌బర్గ్ వైరస్’. ఆఫ్రికా దేశమైన ఈక్వెటోరియల్ గినియాలో ఈ ‘మార్‌బర్గ్ వైరస్‘ను గుర్తించారు.
ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకూ 9 మంది మృతిచెందినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మంగళవారం ప్రకటించింది. ప్రమాదకరమైన ఈ వైరస్‌లో ఎబోలా లక్షణాలుంటాయని పేర్కొంది. అయితే.. ఈ వైరస్ సోకిన వ్యక్తులు హెమరేజిక్ ఫీవర్ బారిన పడి తీవ్ర జ్వరంతో రక్తనాళాలు చిట్లి మరణించే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో అసలు మార్‌బర్గ్ వైరస్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఏంటి? నివారణ ఎలా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. మార్‌బర్గ్ వైరస్ ను తొలిసారిగా 1967లో గుర్తించారు. ఇది జంతువుల శరీరాలను ఆవాసంగా చేసుకుని జీవిస్తుంది. ముఖ్యంగా ఆఫ్రికన్ ఫ్రూట్ గబ్బిలాల్లో ఇది జీవిస్తుంది. గబ్బిలాల్లో ఉండే ఈ వైరస్.. వాటికి ఎలాంటి హాని చేయనప్పటికీ మనుషులను అంతకంతకూ క్షీణింపజేస్తుంది.
ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో ఈ వైరస్ మనుషులకు సోకుతుంది. అంజీరా, మామిడి, ఖర్జూర వంటి పండ్లను ఫ్రూట్ గబ్బిలాలు కొరికి తిన్నప్పుడు వాటి లాలాజలం, సలైవా వాటికి అతుక్కుంటుంది. ఆ పండ్లను కోతులు లేదా మనుషులు తిన్నప్పుడు వాటికి అతుక్కొని ఉన్న సలైవా, లాలాజలం శరీరంలోకి వెళ్లడం ద్వారా ఈ వైరస్ సంక్రమిస్తుంది. ఒక్కసారి ఈ వైరస్ మనుషులకు సోకిందంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. తుంపర్లు, చెమట, సలైవా, వీర్యం, యూరిన్, మలం, తల్లి పాల ద్వారా ఈ వైరస్ సంక్రమిస్తుంది. అలాగే.. ఈ వైరస్ సోకిన వ్యక్తులు ఉపయోగించిన దుస్తులు, బ్లాంకెట్స్, గిన్నెలకు అతుక్కున్న స్రవాలు ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుందని వైద్యులు చెప్తున్నారు.
🚨🦠 WHO: Equatorial Guinea confirms first-ever Marburg virus disease outbreak. 10 people have so far died and 200 more quarantined in the country. pic.twitter.com/9EUq5rPFw7
— Terror Alarm (@Terror_Alarm) February 13, 2023
ఈ వైరస్ సోకితే వచ్చే వ్యాధిని మార్‌బర్గ్ హెమరేజిక్ ఫీవర్ అని పిలుస్తారు. వైరస్ సోకిన తర్వాత 2 నుంచి 21 రోజుల్లోగా లక్షణాలు బయటపడి, మనిషి మరణించే స్థాయికి చేరుకుంటుంది. అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి, అలసట, డయేరియా, రక్తపు వాంతులు, వికారం .. ఇలా అన్ని లక్షణాలు కనిపిస్తాయి. వారం రోజుల్లోగా ఛాతి, వీపు, పొట్ట భాగంలో ఎర్ర మచ్చలు, దద్దుర్లు ఏర్పడతాయి. రక్తస్రావం మొదలవుతుంది. కళ్లు, చెవులు, ముక్కు నుంచి రక్తం కారుతుంది. అంతకంతకు బరువు తగ్గడం, తీవ్ర జ్వరం, అవయవాల వైఫల్యం మనిషి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. ఈ వైరస్ సోకిన 8 నుంచి 9 రోజుల్లోనే మరణానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ కోలుకున్నప్పటికీ కొన్నివారాల పాటు ఈ లక్షణాలు వేధిస్తాయని వెల్లడిస్తున్నారు.
ఇప్పటివరకూ ఈ వైరస్ ను నియంత్రించేందుకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. మందులు లేవు. లక్షణాలను బట్టి మందులు అందిస్తారు. ఆర్టీ-పీసీఆర్, ఎలీసా( ఎంజైమ్ లింక్‌డ్ ఇమ్యూనోసోర్బెంట్ అస్సే ) టెస్టుల ద్వారా మార్‌బర్గ్ వైరస్‌ను నిర్ధారిస్తారు. ప్రస్తుతానికి ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి ఉన్న ఏకైక దారి.. వ్యక్తిగత దూరం పాటించడమే. కావున మరోసారి ఈ ప్రాణాంతకమైన వైరస్ బారిన పడకుండా ఉండాలంటే.. మాస్కులు ధరించండి. చేతులకు గ్లౌజులు వేసుకోండి. ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి.
🚨🦠 WHO to hold emergency meeting; says Equatorial Guinea confirms first-ever Marburg virus disease outbreak. 10 people have so far died and 200 more quarantined in the country.#MarburgVirus
PC: Osmosis pic.twitter.com/xAN2wTMjfV
— Bharggav Roy 🇮🇳 (@Bharggavroy) February 14, 2023