మానవుడే మహనీయుడు.. అని ఓ కవి అన్నట్టు.. మనిషి సాధించలేనిది ఏదీ లేదు అన్నట్టుగా ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ విశ్వాన్నే శాసిస్తున్నాడు. భూమి, సంద్రం, ఆకాశంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ మూడేళ్ల క్రితం అంటే.. 2018లో ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే వ్యోమనౌక సూర్యుడి బాహ్య వాతావరణ పొర ‘కరోనా’ను తాకింది. 11 లక్షల డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతతో మండే అగ్నిగోళాన్ని శోధిస్తోంది. ఇది ఖగోళ చరిత్రలో ఓ అద్భుతం అని అంటున్నారు.
నాసా సాధించిన ఈ అద్భుత విజయం విశ్వంలోని మరిన్ని గుట్టుమట్లను విప్పేందుకు దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యుడు, సూర్యుడి చుట్టూ తిరిగే అన్ని గ్రహాల చరిత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు నిర్విరామంగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే భగభగ మండే అగ్నిగోళంలా ఉండే సూర్యుడికి దగ్గరగా ఇప్పటివరకు ఏ స్పేస్‌క్రాఫ్ట్‌లూ వెళ్లలేకపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సంచలనం సృష్టించింది. వాస్తవానికి నాసా స్పేస్ క్రాఫ్ట్ పార్కర్ నిజానికి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే సూర్యుడి వాతావరణంలోకి వెళ్లింది. అది అక్కడ చిత్రీకరించిన, సేకరించిన డేటా ఇన్ని నెలల తర్వాతగానీ భూమిని చేరుకుంది. పార్కర్ పంపిన సమాచారాన్ని విశ్లేషించి, నిర్ధరించేందుకు శాస్త్రవేత్తలకు ఇంత సమయం పట్టింది.
ఇదీ చదవండి : వెస్టిండీస్ ఆటగాళ్లకు కరోనా.. పాక్ తో మూడో టీ20 జరుగుతుందా?
ఈ నౌక సూర్యుడికి మరింత దగ్గరగా వెళ్లినప్పుడు సూడోస్ట్రీమర్ అనే అయస్కాంత క్షేత్రం ఎదురైంది. చుట్టూ ఉన్నదానితో పోలిస్తే అక్కడి వాతావరణం కొంత నిలకడగా ఉన్నట్టు గుర్తించారు. ఈ వ్యోమనౌక అంత ఉష్ణోగ్రతను ఎలా తట్టుకుంటుందీ అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో కలుగుతుంది. అయితే నాసాతోపాటు పలు ఇతర పరిశోధన సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పార్కర్ ప్రోబ్‌ను సంయుక్తంగా రూపొందించారు. అత్యధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకునేలా దానిచుట్టూ పటిష్ఠమైన కవచం ఏర్పాటు చేశారు.
ఇక నమూనాలను సేకరించేందుకు ఉపయోగించేందుకు బిగించిన కప్, మరో పరికరం మాత్రం కవచం బయట ఉంటాయి. వాటిపై సూర్యకాంతి నేరుగా పడుతుంది. అవి కరిగిపోకుండా టంగ్‌స్టన్, నియోబియం, మాలిబ్డినమ్, సఫైర్ వంటి పదార్థాలతో వాటిని తయారుచేశారు. మొత్తానికి సూర్యుడి నుంచి వెలువడే అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా పార్కర్ ప్రోబ్ కవచాన్ని రూపొందించారు. ఈ చారిత్రాత్మక యాత్ర సూర్యుని చరిత్రను, సౌర వ్యవస్థపై దాని ప్రభావాన్ని బాగా అర్థం చేసుకోవడానికి తమకు సహాయపడుతుందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.