కరోనా మనకి చాలా కొత్త విషయాలను పరిచయం చేసింది. శానిటైజర్ అంటే ఏమిటో కరోనా వచ్చే వరకు చాలా మందకి తెలియదు. మనసులకి తప్ప మొహాలకి మాస్క్ వేసుకుంటారని కూడా అందరికి తెలియదు. కానీ.., కరోనా కొత్త అలవాట్లని నేర్పించేసింది. సరే.., మాములుగా అయితే మనం వాడే మాస్క్ బరువు ఎంత ఉంటుంది? మాస్క్ ధర చెప్పమంటే చెప్పొచ్చు గాని.., బరువు ఎలా చెప్తాము అంటారా? అంత తేలికపాటిగా ఉండే మాస్క్ బరువుని ఎలా కొలుస్తాము అంటారా? ఇక్కడే మీరు తప్పులో కాలు వేశారు. ప్రపంచంలో అన్నీ మాస్క్ లు తేలికగా ఉండవు. మాస్క్ బరువు 35 కేజీలు ఉంటుందని మీరు ఎప్పుడైనా ఊహించారా?
జపాన్ లోని కుషిమా ప్రిపెక్చర్ ప్రాంతంలో 35 కేజీలు వరువు ఉండే మాస్క్ ని తయారుచేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. 57 మీటర్ల ఎత్తున్న తమ బౌద్ధ మాత విగ్రహానికి మాస్క్ ధరింపజేయాలన్న కాంక్షతో అక్కడి ప్రజలు ఈ మాస్క్ ని సిద్ధం చేశారు. 5.3మీటర్ల పొడవు 4.1 మీటర్ల వెడల్పు కలిగిన 35 కేజీల మాస్క్ సిద్ధం చేయడానికి వారం రోజులు సమయం పట్టడం విశేషం. ఇంత బరువు మాస్క్ ని ధరింపచేసిన ఆ బౌద్ధ మాత విగ్రహం 33 ఏళ్ల క్రితం నాటిది. ఈ విగ్రహానికి నలుగురు వ్యక్తులు, మూడు గంటల పాటు కష్టపడి., తాళ్ల సాయంతో మాస్క్ తొడిగారు. జపాన్ లో నిత్యం భూకంపాలు వస్తుంటాయి. వాటి నుండి తమని కాపాడమని ఈ బౌద్ధ మాత విగ్రహానికి ప్రజలు పూజలు చేస్తుంటారు. కానీ.., ఇప్పుడు వీరు ఈ మాస్క్ తొడిగి, కరోనా మహమ్మారి నుండి తమని కాపాడమని వేడుకుంటున్నారు. మరి.. ఈ కరోనా కష్ట కాలంలో ఇంకెన్ని విచిత్రాలు చూడాలో?