Pakistan: సత్తా ఉంటే మైనారిటీ, మెజారిటీ వర్గం అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ సత్కరిస్తారనడానికి ఈ ఉదంతమే నిదర్శనం. పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గానికి చెందిన యువతికి అక్కడి పోలీస్ శాఖలో గౌరవప్రదమైన స్థానం లభించింది. పాక్ పోలీస్ శాఖలో డీఎస్పీగా ఎంపికైన తొలి హిందూ మహిళగా ఆ యువతి నిలిచారు. ఆమె పేరు మనీషా రుపేతా(26). పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్సు జాకో బాబాద్‌లో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు మనీషా. సాధారణంగా పురుషాధిక్య సమాజంలో మహిళలు ఎదగడం అన్నది చిన్న విషయం కాదు. అందులోనూ మైనారిటీ వర్గానికి చెందిన వారికైతే ఎదగడమన్నది ఒక సవాలు లాంటిది. కానీ ఆ సవాలును ఈమె సునాయాసంగా అధిగమించారు.
డాక్టర్ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మనీషా తన చిన్నతనంలో అనేక సవాళ్ళను ఎదుర్కున్నారు. అమ్మాయిలకు టీచర్ లేదా డాక్టర్ ఉద్యోగాలు మేలని, పురుషులు ఎక్కువగా ఉండే పోలీస్ శాఖలో అమ్మాయిలు ఇమడలేరని ఆమె చిన్నప్పటి నుండి వింటూ ఉన్నారు. అందుకే వారి ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె అన్నారు. మహిళలపై వేధింపులు, నేరాలు పెరిగిపొతున్నాయని, ఈ పరిస్థితుల్లో సమాజంలో మహిళలకు మహిళలే రక్షకులుగా మారాల్సిన అవసరం ఉందని, అందుకే తాను పోలీస్ ఉద్యోగాన్ని ఎంచుకున్నానని మనీషా అన్నారు.
సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఎగ్జామ్‌లో 468 మందిలో 16వ స్థానంలో నిలిచిన మనీషా ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. కాగా ఈ ఘనత సాధించడంపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పాకిస్థాన్ చరిత్రలో ఒక హిందూ మహిళ సింధ్ పోలీస్ శాఖలో చేరడం ఇదే మొదటిసారి. సింధ్ ప్రాంతానికి డిప్యూటీ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఎంపికవ్వడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో ఉద్యోగం సాధించిన మనీషాపై, అలానే ఆమె సత్తాను గుర్తించిన పాకిస్థాన్ పోలీస్ శాఖపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Coming from family of #doctors, #ManishaRopeta is #Pakistan’s first #Hindu woman #DSPhttps://t.co/nbWhHk4aaR
— The Tribune (@thetribunechd) July 28, 2022