బతకాలని రాసిపెట్టి ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా బతుకుతారని పెద్దలు అంటుంటారు. చనిపోతారని అనుకున్న చాలా మంది బతికిన సందర్భాలను చూస్తూనే ఉన్నాం. సరిగ్గా అలాంటి కథే ఎల్విన్ ఫ్రాంకోయిస్ ది. కరీబియన్ ద్వీపాల్లోని డొమినికాకు చెందిన ఈ 47 ఏళ్ల వ్యక్తి.. 24 రోజుల పాటు ఒంటరిగా సముద్రంలో గడిపి, మృత్యువును నుంచి వెనక్కి తిరిగి వచ్చాడు. సముద్రంలో ఎక్కడున్నాడో తెలియదు, మాట్లాడేందుకు ఎవరూ లేరు, ఎవరైనా వచ్చి తనను రక్షిస్తారో లేదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల నుంచి సేఫ్ గా బయటపడ్డాడు. అలల ధాటికి తీరం నుంచి సముద్రంలోకి కొట్టుకుపోయిన ఫ్రాంకోయిస్.. మూడున్నర వారాల పాటు నరకం అనుభవించాడు.
కెచప్, వెల్లుల్లి పొడిని వర్షపు నీటిలో కలుపుకుని తింటూ ప్రాణాలు నిలుపుకున్నాడు ఫ్రాంకోయిస్. పాడైపోయిన నౌకలోనే ఉంటూ రక్షించాల్సిందిగా కోరుతూ పడవపై ‘హెల్ప్’ అనే పదాన్ని చెక్కాడు. చాలా వరకు సముద్రంలో నౌకలను చూసినప్పటికీ వాటిని ఆకర్షించడంలో విఫలమయ్యాడు. ఏ నౌక కూడా ఫ్రాంకోయిస్ను గుర్తించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఒకసారి సముద్రంలో వెళ్తున్న షిప్ తనవైపు చూసేందుకు పడవకు నిప్పు కూడా పెట్టాడు. కానీ ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు. అయితే నిప్పు వల్ల పడవకు రంధ్రం పడి నీరు లోపలికి రావడం ప్రారంభించింది. చివరకు ఎలాగోలా కష్టపడి పడవను బాగు చేసుకున్నాడు. అదృష్టవశాత్తు ఓ అద్దం ముక్కతో సాయం కోసం సిగ్నల్ ఇచ్చిన ఫ్రాంకోయిస్ను అటు వైపుగా వెళ్తున్న విమాన సిబ్బంది గుర్తించి కాపాడారు. నావిగేషన్ మీద ఎలాంటి పరిజ్ఞానం లేకపోవడంతో అతడు సముద్రంలో తప్పిపోయాడని అధికారులు తెలిపారు.