ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ ముందు ఎవరి పప్పులు ఉడకవని మరోమారు తేలిపోయింది.
భారత క్రికెట్ జట్టు ఆసియాకప్ లో ఆడేందుకు పాకిస్థాన్ కు వస్తేనే.. వన్డే ప్రపంచకప్ కోసం పాక్ టీమ్.. భారత్ లో అడుగు పెడుతుందని బీరాలు పోయిన పాక్ పెద్దలకు చెంప పెట్టులాంటి నిర్ణయం. క్రికెటర్లు భారత్ లో పర్యటించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ పాల్గొనడం అధికారికంగా కన్ఫామ్ అయింది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నీలో మాత్రమే దాయాదులు తలపడుతున్నాయి. పాకిస్థాన్ జట్టు చివరిసారిగా 2016 లో టీ20 ప్రపంచకప్ లో ఆడేందుకు భారత్ లో పర్యటించింది. ఆ తర్వాత ఇదే మళ్లీ రావడం. అక్టోబర్ 5 నుంచి మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాక్ పోరుకు అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదిక కానుంది.
షెడ్యూల్ ప్రకారం వన్డే వరల్డ్ కప్ కు ముందు పాకిస్థాన్ వేదికగా ఆసియా కప్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అప్పటి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రజా పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చాడు. భారత జట్టు గనక ఆసియా కప్ కోసం.. పాక్ కు రాకుంటే.. వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ కు వచ్చేది లేదని పేర్కొన్నాడు. దీంతో కాస్త సందిగ్ధత నెలకొనగా.. ప్రభుత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటామని పీసీబీ వెల్లడించింది. దీంతో మెగాటోర్నీ నుంచి పాకిస్థాన్ తప్పుకుంటుందా అనే అనుమానాలు కూడా రేకెత్తాయి. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. తాజాగా పాక్ ప్రభుత్వం.. భారత్ లో పర్యటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పాక్ ప్రభుత్వ నిర్ణయంతో బీసీసీఐ పంతం నెగ్గిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆసియా కప్ ఆడేందుకు పాక్ వెళ్లడానికి ససేమీరా అన్న భారత్.. వేదికను మార్చేంత వరకు పట్టు వీడలేదు. దీంతో ఆసియా కప్ వేదికను పాకిస్థాన్ నుంచి శ్రీలంకకు మార్చిన విషయం తెలిసిందే. భారత్ అక్కడ పర్యటించేందుకు పట్టు పడ్డటంతో పాక్ జట్టు ఇక్కడికి రాదేమోననే వార్తలు వినిపించాయి. అయితే వన్డే వరల్డ్ కప్ వంటి మెగాటోర్నీ లను బహిష్కరిస్తే.. అసలుకే మోసం వస్తుందని భావించిన పాకిస్థాన్ ప్రభుత్వం.. తమ జట్టుకు క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో బీసీసీఐ పవర్ ఇది అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.