విద్యార్థి సంఘాల బంద్ పిలుపు నేపథ్యంలో రేపు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలు బంద్ కు సహకరించాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఏపీలో విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా బంద్ కు పిలుపునివ్వగా, తెలంగాణలో ఇంటర్ కాలేజీల బంద్ కు ఏబీవీపీ పిలుపు నిచ్చింది.
రాష్ట్రంలో ఇంటర్ విద్యలో కార్పొరేట్ కళాశాలలను ప్రభుత్వ నియంత్రించడం లేదంటూ ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ మేరకు నారాయణగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై ఇంటర్ బోర్డు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకే పేరుతో వందల కొద్దీ బ్రాంచ్ లు నిర్వహిస్తూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నారాయణ, శ్రీ చైతన్య సహా ఇతర కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.
కాగా, ఆగస్టు 20న హైదరాబాద్, రామాంతపూర్ పరిధిలోని నారాయణ కాలేజీలో టీసీ కోసం విద్యార్థి నిప్పంటించుకున్న ఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల సర్టిఫికెట్లు ఏ కారణంతోనూ ఆపొద్దంటూ కాలేజీలను ఆదేశించింది. అలాగే.. కోర్సు పూర్తైన వారికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: భర్త ఫోన్ స్విచ్ఛాఫ్.. బస్‌లో ఒంటరిగా భార్య.. గొప్ప మనసు చాటుకున్న కండక్టర్!