బీజింగ్- ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదంటే ఠక్కున చెప్పే పేరు చైనా. అవును చైనాలో అత్యధికంగా సుమారు 175 కోట్ల జనాభా ఉంది. గతంలో చైనా తమ దేశ జనాభాను తగ్గించుకునేందుకు చాలా కఠినమైన ఆంక్షలను విధించింది. ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే కనాలని నిబధన పెట్టింది. అంత కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే సంక్షేమ పధకాలను నిలిపివేయడం వంటి ఆంక్షలు పెట్టింది.
చాలా యేళ్లుగా చైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చింది. క్రమంగా చైనా జనాభా తగ్గుతూ వచ్చింది. ఐతే ప్రస్తుతం చైనాలో యువ జనాభా సంఖ్య బాగా తగ్గడం ఆదేశాన్ని ఆందోళనలో ముంచేస్తోంది. వృధ్ద జనాభా బాగా పెరిగి, యువత సంఖ్య గణనీయంగా తగ్గడంతో చైనా ఆలోచనలో పడింది. అందుకే మరోసారి తమ దేశ జనాభా పెంచుకోవాలని చైనా సర్కార్ నిర్ణయించింది.
అందుకే ఇప్పుడు ఎక్కువ మందిని కనాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది చైనా ప్రభుత్వం. కొత్త జంటలు పిల్లలను కనేందుకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది. ఇదిగో ఈ క్రమంలోనే చైనాలోని జిలిన్ ప్రావిన్సు కొత్త పథకం ప్రకటించింది. పెళ్లైన కొత్త జంట పిల్లలు కనాలనుకుంటే వారికి 2 లక్షల యువాన్లు అంటే మన కరెన్సీలో సుమారు 25 లక్షల రూపాయల బ్యాంకు రుణాలిప్పిస్తామని ప్రకటించింది.
చిన్న, మధ్య తరహా వ్యాపారాలు చేసుకునే జంటలకు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలుంటే వారి వ్యాపారాలపై పన్నుల్లో తగ్గింపులు, మినహాయింపులు ఇస్తామని కూడా జిలిన్ ప్రావిన్సు ఆఫర్ ఇచ్చింది. ఇలా చైనాలోని చాలా వరకు ప్రావిన్సుల్లో కొత్తగా పెళ్లైన వారు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి స్థానిక ప్రభుత్వాలు.