చంద్రుడికి సంబంధించిన అద్భుతమైన రెడ్డిట్ ఫోటోను రూపొందించాడు పుణె నగరానికి చెందిన 16 ఏళ్ల ప్రథమేశ్ జాజు. అత్యంత సవివరాత్మక చంద్రుడి ఇమేజ్‌గా ఇది గుర్తింపు సాధించే అవకాశముంది. కెమెరా చేతిలో ఉంటే ఏ చెట్టునో పక్షినో ఫొటోలు తీయడం చాలా మందికి అలవాటే. కానీ పుణెకు చెందిన ఓ పదో తరగతి కుర్రాడు మాత్రం అత్యంత స్పష్టంగా చంద్రుడి ఫొటోలను తీశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రథమేశ్ జాజు స్పష్టమైన జాబిల్లి ఫొటోలు తీసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. అయితే ఇది అతడికి అంత సులువుగా సాధ్యం కాలేదు. 50 వేల ఫొటోలు తీసి వాటన్నింటిని జతచేసి స్పష్టమైన చందమామ ఫొటోను సాధించాడు. ఇందుకోసం అతడు సుమారు 30-40 గంటల పాటు శ్రమించాల్సివచ్చిందని ప్రథమేశ్ చెబుతున్నాడు.చంద్రుడిపై ఉన్న ఖనిజాల రంగులను మన కళ్లు స్థిరంగా చూడలేవు. ఇనుము, ఆక్సిజన్, టైటానియం లాంటి మూలకాలు పుష్కలంగా ఉన్న ప్రాంతాలను చిత్రంలోని నీలం రంగులో చూడవచ్చు. ఇనుము, టైటానియం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఆరెంజ్, పర్పుల్ రంగులు సూచిస్తున్నాయి. సూర్యరశ్మి అధికంగా ఉన్న ప్రాంతాలు తెలుపు, బూడిద రంగుల్లో కనిపిస్తున్నాయని ప్రథమేశ్ తన ఫొటోల గురించి వివరించాడు. ఇంటర్నెట్ ద్వారా యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఇలాంటి ఫొటోలు తీయడం నేర్చుకున్నట్టు అతడు తెలిపాడు. ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో అతడు ఈ ఫొటోలను షేర్ చేయగా ఇప్పటికే 38 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఫొటోగ్రఫీతోపాటు అథ్లెటిక్స్‌పైనా అతడికి మక్కువ. గతంలో జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లోనూ అతడు పాల్గొన్నాడు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రథమేశ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 54 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. భవిష్యత్తులో ఖగోళ భౌతిక శాస్త్రవేత్త కావాలన్నదే తన లక్ష్యమని అతడు చెబుతున్నాడు.