బాహుబలి అనే ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి. అయన సినిమాలు తీయడానికి టైమ్ తీసుకుంటారేమో గానీ, బాక్సాఫీస్ బరిలో దిగితే పాత రికార్డులన్నీ గల్లంతే అని ప్రతి సినిమాతో ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా మల్టీస్టారర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజమౌళి.. దేశవ్యాప్తంగా ఎంతోమంది దర్శకులకు ఆదర్శంగా నిలిచారు. కాగా, తాజాగా రాజమౌళి ‘హిట్ 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ గెస్ట్ గా పాల్గొని సందడి చేశారు. ఇదే ఈవెంట్ లో పాల్గొన్న హీరో విశ్వక్ సేన్.. రాజమౌళిపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “మీ ముందు మాట్లాడాలంటే భయంగా ఉంది. హిట్ 1 ఈవెంట్ కి కూడా మీరే వచ్చారు. మీ ముందు రెండు పేజీల డైలాగ్ కూడా రెండు లైన్స్ అయిపోయింది. ఇండియన్ సినిమాని ప్రపంచానికి పరిచయం చేసినందుకు, రిప్రెజెంట్ చేస్తున్నందుకు థాంక్యూ సర్. మేం ఎక్కడికెళ్లినా తెలుగు నుండి వచ్చామంటే ఇచ్చే మర్యాద పెరిగిపోయింది. మా జాబ్ చాలా ఈజీ చేశారు. ముంబై, చెన్నైకి వెళ్లి తెలుగు నుండి వచ్చామంటే మర్యాద పెరిగింది. దాంట్లో మేం పీకిందేమి లేదు. కానీ.. మీరు చేసిన సినిమాలతో మాకిచ్చే మర్యాద మారిపోయింది. థాంక్యూ సర్” అని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. అడవి శేష్ హీరోగా నటించిన ఈ హిట్ 2 సినిమా.. డిసెంబర్ 2న థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. హిట్ ని తెరకెక్కించిన దర్శకుడు శైలేష్ కొలను.. ఈ సీక్వెల్ ని కూడా రూపొందించాడు. ఈ సినిమాను హీరో నానితో పాటు ప్రశాంతి తిపర్నేని సంయుక్తంగా నిర్మించారు. కాగా.. ఈ హిట్ సిరీస్ మొత్తం ఏడు భాగాలుగా రాబోతుందని సమాచారం. ఇప్పటికే సినిమాకి సంబంధించి ట్రైలర్, సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. సినిమాపై అంచనాలు పెంచేశాయి. చూడాలి మరి ‘హిట్ వర్స్’లో మరో బ్లాక్ బస్టర్ రెడీ అయ్యిందేమో.. ఇక రాజమౌళి తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయనున్న విషయం విదితమే.