బుల్లితెర టాప్ కామెడీ షో జబర్థస్త్. 2013లో ప్రారంభమైన ఈ షో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అనేక మంది కంటెస్టెంట్లు, టీమ్స్ మారినా, యాంకర్లు, జడ్జీలు మారినా…ఈ షో నుండి నవ్వులు పువ్వులు ఆగడం లేదు. తొలుత రోజా, నాగబాబు జడ్జీలుగా ఉండగా.. కొన్ని కారణాల వల్ల నాగబాబు ఈ షో నుండి తప్పుకున్నారు. నాగబాబు తర్వాత ప్రముఖ సింగర్, ఆర్టిస్ట్ మనో కొంతకాలం జడ్జీగా చేసి సడెన్ గా ఈ షో నుండి బయటకు వచ్చేశారు. దీనిపై చాలా రూమార్లు కూడా వచ్చాయి. మల్లెమాలతో విబేధాలే కారణమని వార్తలు గుప్పుమన్నాయి. ప్రస్తుతం ఆయన జీ తెలుగులో ప్రసారం అవుతున్న సరిగమప చాంపియన్ షిప్ తాజా సీజన్ లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
జబర్దస్త్ నిష్క్రమణపై తాజాగా మనో స్పందించారు. జబర్దస్త్ కు తాను చిన్న గ్యాప్ ఇచ్చానని, మళ్లీ వస్తానని చెప్పారు. కోవిడ్ కారణంగా కొన్ని షోలు వాయిదా పడ్డాయని చెప్పారు. ఇందులో ఇళయరాజా, ఎఆర్ రెహమాన్‌లతో తాను చేయాల్సిన షోలను ప్రస్తుతం పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. 2020లో ఖరారు అయిన ఈ షో ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మార్చి తర్వాత ఇప్పటి సరిగమపతో పాటు జబర్దస్త్ ను కూడా కొనసాగిస్తానని చెప్పారు. తనకు కామెడీ అంటే చాలా ఇష్టమని, దగ్గరి వ్యక్తులకు దాని గురించి బాగా తెలుసునన్నారు.
జబర్దస్త్ లోని కమెడియన్ల స్కిట్లతో తాను ఎంతో ఎంజాయ్ చేశానని, త్వరలోనే మళ్లీ ఆ షోకి వస్తానని చెప్పారు. అటు సరిగమపలో జడ్జిగా వ్యవహరించడంపై కూడా ఆయన స్పందిస్తూ..ఇది నా హోమ్ గ్రౌండ్ లాంటిదని, ఇదే తన పని అని చెప్పారు. గతంలో కూడా ఈ షోలో జడ్జిగా ఉన్నానని, ఇప్పుడు 5-6 సీజన్లు గడిచిన తర్వాత ఈ అవకాశం వచ్చినట్లు తెలిపారు. ఇది చాలా గొప్పగా అనిపిస్తుందని తెలిపారు. కాగా, ఈ షో ఈ నెల 29న నుండి జీ తెలుగులో ప్రారంభమైంది. ఈ షోకి జడ్డిలుగా మనోతో పాటు ఎస్ పి శైలజ, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ లు ఉన్నారు. మనో తిరిగి జబర్దస్త్ రావాలని మీరూ భావిస్తున్నట్లయితే.. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.