టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతున్నారని సమాచారం. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు నాట మేటి దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు దర్శకుడు శేఖర్ కమ్ముల వద్ద సహాయ దర్శకుడిగా చేసిన నాగ్ అశ్విన్ మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంతో తానేంటో నిరూపించుకున్నాడు. మహానటి, కల్కి ఏడీ 2898తో స్టార్ డైరెక్టర్‌గా మారాడు. ఇప్పుడు కోలీవుడ్‌పై దృష్టి పెట్టాడు. అది కూడా ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతున్నాడట.
ఇందులో భాగంగా ఇప్పటికే రజనీకాంత్‌ను కలిసి ఓ కధను కూడా విన్పించి ఒప్పించారట. ఆ కధ నచ్చడంతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని రమ్మన్నారని తెలుస్తోంది. రజనీకాంత్-నాగ్ అశ్విన్ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మించనుందని సమాచారం. ప్రస్తుతం జైలర్ 2తో బిజిగా ఉన్న రజనీకాంత్ తరువాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమలహాసన్‌తో మల్టీస్టారర్ సినిమా చేయనున్నారు. ఆ తరువాతే నాగ్ అశ్విన్ సినిమాకు డేట్స్ ఇవ్వచ్చు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
నాగ్ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు కల్కి ఏడీ సీక్వెల్ కూడా తెరకెక్కించాల్సి ఉంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్‌తో విమెన్ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కించనున్నారు. నాగ్ అశ్విన్‌తో పాటు ఇతర దర్శకులు విశిష్ట, వివేక్ ఆత్రేయ కూడా రజనీకు కధలు విన్పించినా ఆ ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. అంతా అనుకున్నట్టే జరిగితే నాగ్ అశ్విన్ ఖ్యాతి మరింత పెరగనుంది. నాగ్ అశ్విన్ రజనీకాంత్‌కు విన్పించిన కధంతా యాక్షన్ డ్రామా నేపధ్యంగా సాగుతుందట. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పెద్ద ఎత్తున ఉంటాయని సమాచారం. బాలీవుడ్ ఒకరిద్దరు స్టార్ నటులు కూడా ఈ సినిమాలో కన్పించవచ్చని తెలుస్తోంది.