సినిమా టిక్కెట్ల పెంపు విషయంలో టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయమే సరైందని స్పష్టం చేశారు. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలపై మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రీమియర్ షో ధరలు భారీగా పెంచుకునేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి. ఏపీలో అయితే ఓజీ సినిమా ప్రీమియర్ షో ధర ఏకంగా 1000 రూపాయలుంది. సినిమా టికెట్ ధర ఈ స్థాయిలో ఉండటం ఇదే మొదటిసారి. ఈ అంశంపై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
ఓజీ సినిమా టికెట్ ధరలు భారీగా పెంచడం సరైంది కాదన్నారు. చిత్ర నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వాలు కళ్లు మూసుకుని అనుమతులిచ్చేస్తున్నాయని విమర్శించారు. ఇష్టం వచ్చినట్టుగా టికెట్ ధరలు పెంచితే పరిశ్రమ కచ్చితంగా నష్టపోతుందన్నారు. ప్రేక్షకులు ధియేటర్‌కు రావడం మానేసి ఓటీటీ లేదా పైరసీలకు అలవాటు పడతారని నట్టి కుమార్ హెచ్చరించారు.
జగన్ నిర్ణయాలే సరైనవి
సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలు సరైనవని నట్టి కుమార్ తెలిపారు. సినిమా బడ్జెట్ ప్రకారం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చేవారన్నారు. 100 కోట్లు దాటితే 50 రూపాయలు, 150 కోట్లు దాటితే 100 రూపాయలు పెంచుకునేందుకు అప్పటి ప్రభుత్వం ఓ విదానం అవలంభించిందన్నారు. ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ చిత్రానికే 100 రూపాయలు పెంచారని గుర్తు చేశారు. అంతేకాకుం డా జీఎస్టీ ఖర్చు చూపిస్తే ఆ మొత్తం తిరిగి చెల్లించేస్తామంటూ జారీ చేసిన జీవో చాలామందికి ఉపయోగపడిందన్నారు. అప్పట్లో జగన్ తీసుకున్న నిర్ణయాలు కొందరికి నచ్చకపోయినా చలనచిత్ర పరిశ్రమకు మాత్రం అనుకూలంగా ఉండేవన్నారు. ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచుతూ ప్రేక్షకులు ధియేటర్ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో టికెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని సూచించారు.
రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా, యూరియా కోసం అల్లాడుతున్నా పట్టించుకోని ప్రభుత్వాలు సినిమా నిర్మాతలకు మేలు చేసేందుకు మాత్రం వెనుకాడటం లేదన్నారు. ఓ సినిమాకు ఇచ్చిన ప్రాధాన్యత..కనీసం అన్నదాతకు ఇవ్వకపోతే ఎలాగని నట్టి కుమార్ ప్రశ్నించారు.